ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి పెద్ద మనసు చాటారు. అరుదైన వ్యాధితో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువతికి చికిత్స అందించేందుకు రూ. 25 లక్షలు మంజూరు చేశారు. వనపర్తి నియోజకవర్గం రేవల్లికి చెందిన శివాని.. పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా (PNH) అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆస్పత్రిలో చికిత్స చేసేందుకు రూ. 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో యువతి ప్రాణాలు నిలిపే అవకాశం ఉంది. అయితే, వైద్యానికి డబ్బులు లేకపోవడంతో యువతి కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి రేవల్లి గ్రామస్తులు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి.. శివాని ఆరోగ్య పరిస్థితిని మంత్రి.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దమనసుతో శివాని చికిత్స నిమిత్తం రూ. 25 లక్షల ఎల్‌వోసీని మంజూరు చేశారు. ఎల్‌వోసీని మంగళవారం యువతి తండ్రి బాల్ రెడ్డికి మంత్రి నిరంజన్ రెడ్డి అందజేశారు. దీంతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో శివానికి చికిత్స చేయనున్నారు. శివాని కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: పసిడి ప్రియులకు ఊరట.. నేటి బంగారం రేట్లు ఇవే..