హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని, ఇది యుంగ్ ఇండియా అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ బహదూర్‌పల్లిలో మహీంద్రా యూనివర్సిటీలో శనివారం నిర్వహించచిన తొలి స్నాతకోత్సవంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఆవిష్కర్తలను, వాణిజ్యవేత్తలను ప్రోత్సహించే అంశంలో తెలంగాణ చాంపియన్ స్టేట్‌గా అవతరించిందన్నారు. ఆవిష్కర్తలను, వాణిజ్యవేత్తలకు ప్రోత్సాహం అందించే విధంగా విధానాలు రూపొందించామన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని చెప్పడానికి గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. దేశ జనాభాలో సగానికిపైగా జనాభా 27 ఏండ్లలోపు వారేనని తెలిపారు. 60 శాతానికిపైగా జనాభా 35 ఏళ్ల లోపు వారేనన్నారు. ప్రస్తుతం యువత ఆవిష్కరణల్లో చురుకుగా ఉందని కొనియాడారు. రాజకీయ నాయకులు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా తమకు ప్రజలిచ్చిన 5 సంవత్సరాల్లో నాలుగున్నర నెలలు ఆర్థిక అంశాలపై దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్నారని తనకు తెలుసన్నారు. అయితే హైదరాబాద్, తెలంంగాణలో ఉన్న ఉద్యోగ అవకాశాలను పరిశీలించాలని వారిని కేటీఆర్ కోరారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా తెలంగాణ పెట్టుబడులను ఆకర్షించిందని కేటీఆర్ స్పష్టం చేశారు.
చైనాతో పోలిస్తే పూర్తి వెనుకంజలో దేశం…
ఒకప్పుడు చైనాతో సమానంగా భారత జీడీపీ ఉండేదని ఇన్నేళ్ల తర్వాత దేశం పూర్తిగా వెనుకబడిందని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం చైనా 16 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. భారత్ మాత్రం ఇప్పటికీ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ప్రణాళికలు రచిస్తుండడం బాధాకరమన్నారు. ఇందుకు తానెవరినీ నిందించదలుచుకోలేదన్నారు.
సైన్స్‌తో ఆర్ట్ కలిసినపుడే ఆవిష్కరణలు.. ఆనంద్ మహీంద్రా
కేవలం ఒకే విధంగా ఆలోచించడం వల్ల ఆవిష్కరణలు రావని, ఆర్ట్, సైన్స్ కలయికతోనే ఆవిష్కరణలు సాధ్యమవుతాయని మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. మహీంద్రా యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్‌కు తాను మొదటిసారి వచ్చానని, తనకు ఎంతగానో నచ్చిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అనుకూల విధానాలు అవలంబిస్తోందని పేర్కొన్నారు.
యువత కల్పన అలవర్చుకోవాలి…
యువత కల్పన అలవర్చుకున్నపుడు గొప్ప వ్యాపారవేత్తలుగా ఎదుగుతారని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మా రంగాలు రెండు స్తంభాలలాగా వృద్ధి చెందడానికి మంత్రి కేటీఆర్ విజన్ కారణమని అన్నారు. దేశ జీడీపీ డబుల్ డిజిట్‌లో వృద్ధి చెందాలంటే ఆవిష్కరణలతోనే సాధ్యమని తెలిపారు. యువత వ్యాపారవేత్తలుగా మారడాన్నే తమ మొదటి ఆప్షన్‌గా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నాని, మాజీ సీఈవో వినీత్ నయ్యర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, యూనివర్సిటీలో వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.