హైదరాబాద్ – నేడు సీఎం రేవంత్ అధ్యక్షత న కేబినెట్ భేటీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ లో తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఇక . ఉదయం 11.30 కు సచివాలయంలో హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు సిఎం.
నేడు జరిగే. కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. హైడ్రాకి చట్ట బద్దత ద్వారా ఆర్డినెన్సు తీసుకురావడం ,మూడు యూనివర్సిటీలకు పేర్లు ఖరారు చేయడం, భారీ వర్షాలు- వరదల కారణంగా జరిగిన నష్టం, రేషన్ కార్డులు జారీ, హెల్త్ కార్డులు మంజూరు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు, త్రిబుల్ ఆర్ భూసేకరణ, పనుల ప్రారంభం, ఎస్ఎల్బిసి పనులు – నిధుల విడుదల, ఉద్యోగుల డీఏలు – సమస్యలు తదితర అంశాలపై చర్చించనున్నారు.
హైడ్రాకు అందించే ప్రతిపాదనలపై మంత్రివర్గం నిర్ణయం..
రెవెన్యూ, పురపాలక, నీటిపారుదల శాఖలు అనుభవిస్తున్న కొన్ని ప్రత్యేక అధికారాలను హైడ్రాకు అందించే ప్రతిపాదనలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. తక్షణమే ఆర్డినెన్స్ రూపంలో ఉత్తర్వులు జారీ చేయడం, హైడ్రాకు చట్టబద్ధత, ప్రత్యేక అధికారాలు కల్పించే అవకాశం ఉంది.
ORR పరిదిలో చెరువులు, కాలువల పరిరక్షణ కోసం రెవెన్యూ, పురపాలక మరియు నీటిపారుదల శాఖ చట్టాల ప్రకారం హైడ్రాకు కీలక అధికారాలు అప్పగించబడతాయి. చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసేందుకు, కూల్చివేతలకు అవసరమైన అధికారాలను హైడ్రా పొందుతుంది..
శీతాకాల శాసనసభ సమావేశాల్లో హైడ్రా చట్టం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవలి భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై మంత్రివర్గం చర్చించనుంది. వరద బాధితులకు పరిహారం, దెబ్బతిన్న పంటలు, రోడ్లు, చెరువుల మరమ్మతులు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.
వరదల కారణంగా రాష్ట్రానికి రూ.10,300 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసిన ప్రభుత్వం కేంద్ర సాయం కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. కేంద్రం నుంచి సాయం అందే అంశంపై కూడా చర్చించనున్నారు.
రాష్ట్రంలోని మూడు యూనివర్సిటీలకు కొత్త పేర్లను పెట్టేందుకు ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించనుంది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి తెలుగు యూనివర్సిటీగా, కోఠి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా, హ్యాండ్లూమ్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీగా కొత్త పేర్లను పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే..