వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. మొత్తం 12 జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న పట్టభద్రలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మొత్తం 4,63,839 మంది ఓటర్లున్నారు. పోలింగ్ కోసం మొత్తం 605 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక బ్యాలట్ పేపర్ ద్వారా నిర్వహించారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సోమవారం స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయగా.. ప్రైవేటు సంస్థలు, కార్యాలయాల్లో పనిచేసే వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పనివేళల్లో వెసులుబాటు కల్పించారు.
ఒక్కో సెంటర్లో 800 ఓట్లు..
ఒక పోలింగ్ కేంద్రంలో సగటున 800 మంది ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పట్టణాలు, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 283 పోలింగ్ కేంద్రాల్లో 800 మంది కంటే ఎక్కువగా ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికలో నోటా ఆప్షన్ ఉండదు. ఈ ఎన్నికకు నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన రిటర్నింగ్ అధికారి (ఆర్వో)గా వ్యవహరిస్తున్నారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
పల్లా రాజీనామాతో..
ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధానంగా మూడు పార్టీల మధ్యే పోటీ నెలకొంది. కాంగ్రెస్ తరపున చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న), బీజేపీ నుంచి ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ తరఫున ఏనుగుల రాకేశ్‌రెడ్డి బరిలో నిలిచారు.
ఓటు వేసిన ప్రముఖులు
ఈ ఎన్నికల్లో పలు పార్టీలకు చెందిన పలువురు నేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేటలోని జూనియర్ కళాశాలలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఓటు వేశారు. భువనగిరి జిల్లా తుర్కపల్లిలో కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న దంపతులు , హన్మకొండలో బీఆర్ఎస్ అభ్యర్ధి ఏనుగుల రాకేశ్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్లగొండ పట్టణంలోని డైట్ కళాశాలలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య ఆయా జిల్లా కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.