హైదరాబాద్ – వచ్చే ఎన్నికలలో బిజెపి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.. కెసిఆర్ అవినీతి పాలనను అంతం చేసే బుల్ డోజర్ ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కోరకుంటున్నరని అయన అన్నారు. తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,. ”కేసీఆర్.. రోజులు లెక్కపెట్టుకోండి. మీ కుటుంబాన్ని ఫామ్ హౌస్‌కే పరిమితం చేస్తాం. మీ కుటుంబానికి బానిసలం కాదు. నిజాం భవనాన్ని తలపించేలా ప్రగతి భవన్ కట్టుకున్నారు. పేద ప్రజల ఇళ్ల కోసం మాత్రం స్థలం, నిధులు ఉండవు. భారాస, భాజపా ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 10 ఎకరాలు పార్టీ కార్యాలయం కోసం ఇచ్చిందెవరు? తీసుకున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీని తలదన్నేలా భారాస అవినీతి చేసింది. మేము ఏ పార్టీతో కలవం.. కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించడమే మా లక్ష్యం. తెలంగాణ ప్రజలు భాజపా నేతృత్వంలో యుద్ధం చేస్తారు. తెలంగాణలో ఒక అడుగు వెనక్కి వేశామంటే పది అడుగులు ముందుకేస్తాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ వార్నింగ్ ఇచ్చారు.
జాతీయ రాజకీయాలపై స్పందిస్తూ, వెయ్యి మంది కేసీఆర్‌లు, లక్షమంది ఒవైసీలు, రాహుల్ గాంధీలు వచ్చినా 2024లో నరేంద్రమోడీని అడ్డుకోలేరు. ప్రతిపక్షాల కూటమిలో ఎవరు ప్రధానమంత్రి అవుతారో తెలియదు. ఆ కూటమి అధికారంలోకి వస్తే 3నెలలకో ప్రధానమంత్రి మారుతారు. ఎవరినీ ఆ కుర్చీలో కూర్చోనివ్వరు. ఒకరు కాలు పట్టి గుంజితే.. మరొకరు చేయిపట్టి లాగుతారు. దేశ ప్రజలు సమర్థవంతమైన నాయకత్వం కోరుకుంటున్నారు” అని కిషన్‌రెడ్డి అన్నారు.