హైదరాబాద్ – నాసిరకం విత్తనాలను, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రైతుకు నష్టం చేసే ఏ విత్తన వ్యాపారినీ కూడా తమ ప్రభుత్వం ఉపేక్షించదన్నారు.. నాణ్యమైన విత్తన ఉత్పత్తి విషయాల్లో పురోభివృద్ధి సాధించేందుకు సకల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు త్వరలో ఒక నూతన విత్తన విధానం తీసుకురాబోతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.
కౌలు రైతులకు కూడా రైతు భరోసా
రాష్ట్రంలోని కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామని భట్టి విక్రమార్క శాసనసభలో ప్రకటించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. రైతుబంధు నిబంధనలను పునఃసమీక్ష చేసి నిజమైన అర్హులకు రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15 వేలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు. అదే విధంగా ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో పంటల భీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నామని తెలిపారు. రైతుబీమా పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని చెప్పారు.
రూ. 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ..
రైతుల రుణమాఫీపై డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా భట్టి రైతు రుణమాఫీపై మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నామని తెలిపారు. రూ. 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. అందుకు విధివిధానాలను రూపొందిస్తున్నాం. ప్రతి పంటకు మద్దతు ధర కూడా అందిస్తామన్నారు.
ఆరు గ్యారెంటీల అమలుకు రూ. 53,196 కోట్లు..
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుకు రూ. 53,196 కోట్లు ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయడం జరిగిందన్నారు. హామీలకు సంబంధించిన విధివిధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున, అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తాం అని విక్రమార్క తెలిపారు.
గృహజ్యోతి పథకానికి రూ. 2,418 కోట్లు కేటాయింపు..
రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకు గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించబోతున్నామని ఆర్థిక భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ పథకం అమలుకు ఇప్పటికే మంత్రివర్గ నిర్ణయం జరిగిందన్నారు. దాని అమలుకు కావాల్సిన సత్వర చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ పథకం అమలుకు బడ్జెట్‌లో రూ. 2,418 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు రూ. 16,825 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు భట్టి తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి స్పష్టం చేశారు.