Friday, November 22, 2024

క‌ర్నాట‌క‌లో ఓట‌మి – తెలంగాణ‌లో వ్యూహం మార్చిన బిజెపి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కర్ణాటకలో అధికారాన్ని కోల్పోయిన లోటును తెలంగాణలో విజయం సాధించి సర్కారు ఏర్పాటు చేసి భర్తీ చేయా లని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కన్నడ నాడులో కాంగ్రెస్‌ విజయకేతనం ఎగురవేసిన నేపథ్యంలో ఇక ఆ పార్టీ దృష్టంతా తెలంగాణపైనే ఉంటుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే వరుస కార్యక్రమాలు, ర్యాలీ లు, సభల ద్వారా తెలంగాణ ఓటర్లను ఆకర్షిస్తున్న కమలం పార్టీ మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అసెంబ్లి ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్రంలో ముఖ్య నేతలు, ప్రజాదరణ ఉన్న నేతలతో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లి ఎన్నికల్లో వ్యూహరచనే లక్ష్యంగా బీజేపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే రాజేందర్‌ను పార్టీ అధిష్టానం ఢిల్లికి పిలిపించినట్లు చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీలోకి చేరికలను ప్రోత్సహించేందుకు, పార్టీని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపైనా ఈటలతో పార్టీ అధిష్టానం చర్చించినట్లు సమాచారం.

దాదాపు రెండు రోజులపాటు ఢిల్లిలో ఈటలతో బీజేపీ అగ్ర నేతల మంతనాలు జరిపారు. త్వరలోనే వివిధ పార్టీల నేతలు బీజేపీలో చేరేలా ప్రోత్సహించే చర్యలపైనా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లో అసంతృప్త ముఖ్య నేతలు ఎవరు..? అన్న వివరాలను అడిగి తెలుసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పార్టీ అధిష్టానం నిర్దేశం మేరకు త్వరలో వివిధ పార్టీల నేతలతో ఈటల సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నా యి. దాదాపు మూడు రోజులపాటు ఈటల ఢిల్లిలో పర్యటించారు. సోమవారం సాయంత్రం ఉన్నఫలాన అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లి వెళ్లిన ఆయన బుధవారం రాత్రి తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఢిల్లి పర్యటనలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షాతోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో ఆయన కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రాష్ట్రం లో అనుసరించాల్సిన అసెంబ్లి ఎన్నికల వ్యూహాలు, బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన మార్గా లు, మిషన్‌-90 సాధనలో గ్రౌండ్‌ రియాలిటీ ఏంటీ…? తదితర అంశాల్లో ఈటలకు అధిష్టానం స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. మరోవైపు ఈటల ఢిల్లి పర్యటన రాష్ట్ర బీజేపీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. పార్టీ అధిష్టానం బండి సంజయ్‌ స్థానంలో ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించనుందనే చర్చ నేతల్లో జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement