Friday, January 24, 2025

Telangana BJP ప్రెసిడెంట్ ఈటల?! రాష్ట్ర పగ్గాలు ఇచ్చేందుకు అంతా రెడీ

బీసీ మంత్రాన్ని నమ్ముకున్న బీజేపీ
ఈటలకు కలిసిరానున్న ముదిరాజ్​, రెడ్డి సామాజికవర్గాలు
నాన్​ కాంట్రవర్షియల్​ లీడర్​గా గుర్తింపు
తెలంగాణ ఉద్యమ నేతగా మంచి పేరు
అధ్యక్ష పదవికోసం పోటీపడుతున్న వారిలో ఈయనే బెటర్​
అన్ని అంశాలను బేరీజు వేసిన హై కమాండ్​
కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ నుంచి చేరికలకు ప్లాన్​
పార్టీని వేగవంతంగా నడిపించేందుకు కసరత్తు
ఆర్​ఎస్​ఎస్​ బ్యాక్​గ్రౌండ్​ అక్కర్లేదన్న కిషన్​రెడ్డి
ఈటలను దృష్టిలోపెట్టుకునే ఈ కామెంట్స్ చేశారా
పొలిటికల్​ సర్కిళ్లలో జోరుగా చర్చలు

ఆంధ్రప్రభ, సెంట్రల్​ డెస్క్​ : తెలంగాణ కాషాయ ర‌థ‌సార‌థిగా మ‌ల్కాజ్‌గిరి ఎంపీ, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఎంపిక దాదాపు ఖ‌రారైన‌ట్టేనని తెలుస్తోంది. ఈ నెలాఖరు లోగా దీనిపై అధికారిక ప్రకటన, ఈట‌ల పగ్గాలు చేపట్టడం ఖాయమ‌ని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ సంస్థాగ‌త ఎన్నిక‌లు పూర్తవుతున్న క్రమంలో కీల‌క‌మైన రాష్ట్ర అధ్యక్ష ప‌ద‌వి ఖ‌రారుపై జాతీయ‌పార్టీ దృష్టి సారించింది. ఈట‌ల సార‌థ్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక శ్రద్దతో ఉన్నట్టు పార్టీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. గ‌తంలోనే ఈటలకు కీల‌క బాధ్యత‌లు అప్పగిస్తామ‌ని షా మాట కూడా ఇచ్చారు. అయితే.. బండి సంజ‌య్, ఈటల మ‌ధ్య గ్యాప్‌తో లోక్‌సభ ఎన్నిక‌ల‌కు ముందు ఈటలకు ప‌గ్గాలు ఇవ్వడానికి అధిష్టానం సాహ‌సించ‌లేద‌నే టాక్ ఉంది. అందుకే మ‌ధ్యే మార్గంగా కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి మ‌ళ్లీ రాష్ట్ర ప‌గ్గాల‌ను అప్పజెప్పార‌నేది స‌మాచారం.

- Advertisement -

ఇది కలిసివచ్చే అంశం..

వాస్తవానికి, రాష్ట్రంలో బీసీల్లోనే కాకుండా జ‌నాభాప‌రంగా అత్యధిక సంఖ్యాకులున్న ముదిరాజ్ సామాజిక వ‌ర్గానికి చెందిన ఈటల రాజేందర్‌కు.. రెడ్డి సామాజిక వ‌ర్గంతో కూడా మంచి సంబంధాలున్నాయి. ఈటల స‌తీమ‌ణి రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందినవారే కావ‌డం ఇక్క‌డ ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చే అంశం. ఇటు బీసీ కార్డు, అటు రాజ‌కీయంగా బ‌ల‌మైన రెడ్డి సామాజిక‌వ‌ర్గంతో రిలేష‌న్స్ ఈటలకు క‌లిసి వ‌చ్చే అంశాలుగా ఉన్నాయి. దీంతో రాష్ట్ర నాయ‌క‌త్వ బాధ్యత‌లు ఇవ్వడంతో రెండూ క‌లిసి వ‌స్తాయ‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. బీఆరెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఆరోప‌ణ‌లు, బండి, ఈటల మ‌ధ్య విభేదాలు అప్ప‌ట్లో అయోమయ వాతావ‌ర‌ణానికి దారితీశాయి. ఇట్లా శాస‌నస‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి గ‌ట్టి దెబ్బ ప‌డింది. ఎంపీ ఎన్నిక‌ల్లో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ.. బండి సంజ‌య్‌కు కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇవ్వడంతో ఈటలకు లైన్ క్లియ‌ర్ అయ్యింద‌నేది మ‌రో వాద‌న ఉంది..

నాన్​ కాంట్రవర్షియల్​ లీడర్​..

వాస్తవానికి ప్రస్తుతం అధ్యక్ష ప‌దవి రేసులో ఈటలతో పాటు ఎంపీలు ధర్మపురి అరవింద్‌, ర‌ఘునంద‌న్‌రావు, మరో నేత రామచంద్రరావు వంటి వారు పోటీ పడుతున్నారు. వారితో పోలిస్తే నాన్ కాంట్రవర్షియల్‌ నేతగా, రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలున్న ఈటల రాజేందరే బెటర్ అన్న ఆలోచనలో అధిష్టానం ఉంద‌ని తెలుస్తోంది. ఇక‌.. రాజా సింగ్ పేరు కూడా వినిపిస్తున్నా.. సామాజిక‌, ఆర్థిక‌, రాజ‌కీయ‌ నేపధ్యంతో పాటు వ్యక్తిగ‌తంగా చూసుకున్నా ఈట‌ల రాజేంద‌ర్‌ వైపే ఢిల్లీ పెద్దలు మొగ్గు చూపుతున్నారు.

ఉద్యమ నేతగా టాప్​ ప్రయారిటీ..

తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో ఉద్యమ‌కారుడిగా, రాడిక‌ల్ భావ‌జాలంతో రాజకీయాల్లో ఎదిగిన ఈటల మాస్ లీడర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఉద్యమ సమయం నుంచి గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ న‌మ్మినబంటుగా ఉంటూ హుజురాబాద్ ప్రజ‌ల గుండెల్లో సుస్థిర‌ స్థానం ప‌దిలం చేసుకున్నారు. వ‌రుస‌గా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వ‌చ్చారు. కేసీఆర్‌ను ఎదిరించి బీజేపీ అభ్యర్ధిగా బైపోల్స్‌లో కూడా విజ‌యం సాధించి సంచ‌ల‌నం సృష్టించారు. తర్వాత మ‌ల్కాజ్‌గిరి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా గెలిచి బీజేపీ జెండా ఎగుర‌వేశారు. ఈటలకు బీజేపీ రాష్ట్ర బాధ్యత‌లు ఇస్తే ఉద్యమ సంబంధాలు, సామాజిక బ‌లం తోడై పార్టీ మరింత బలోపేత అవుతుందని అధిష్టానం భవిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈటలకు ప‌గ్గాలు అప్పగించి రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను కోలుకోకుండా చేయాలని స్కెచ్ వేసిన‌ట్టు ప‌రిస్థితులు తెలియ‌జేస్తున్నాయి.. బీఆర్ఎస్ నేత‌ల‌తో స‌త్సంబంధాలున్న ఈటల వారిని బీజేపీలోకి లాగుతార‌నే అంచ‌నాలు కూడా ఉన్నాయి..

ప్రధాన ప్రతిపక్షంగా ఎదగిచ్చని..

దాంతో ప్రధాన ప్రతిప‌క్షంగా బీజేపీ ఎద‌గ‌వ‌చ్చని లెక్కలు వేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం ప్రధాన ప్రతిప‌క్షంగా బీఆర్ఎస్‌ క‌నుమ‌రుగైతే తెలంగాణ‌లో బీజేపీనే ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఆ అంచ‌నాలతోనే మాస్ ఇమేజ్‌ పుష్కలంగా ఉన్న ఈటలకు పగ్గాలు అప్పజెప్పాలని ఢిల్లీ పెద్దలు ఫిక్స్ అయ్యార‌ని టాక్‌. వ‌చ్చే వారంలోగా సంస్థాగ‌త ఎన్నిక‌ల‌న్నీ పూర్తవుతున్న త‌రుణంలో ఈటలను అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

నోటి దురుసే మైనస్​పాయింట్​..

నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా అధిష్టానం దృష్టిలో ఉన్నప్పటికీ ఆయ‌న ఆవేశం మైన‌స్ పాయింట్‌గా మారింద‌ని వాద‌న‌లున్నాయి. ఇక‌.. రాజాసింగ్‌కు విస్తృత‌మైన ప్రజాస‌బంధాలు లేవు. ఆయన ఇమేజ్ సొంత సెగ్మెంట్ అయిన గోషామహల్‌కే ప‌రిమితం. రామచంద్రరావు వంటి లీడర్లు ప్రజల‌ను ప్రభావితం చేయగలిగే లీడర్లు కాదని అధిష్టానం అభిప్రాయప‌డిన‌ట్టు తెలుస్తోంది. కానీ, ఈట‌ల రాజేంద‌ర్‌ రాష్ట వ్యాప్తంగా ప్రభావం చూపించగల నేత‌గా కాషాయ పెద్ద‌లు అంగీక‌రించార‌ని, అందుకే ఆయనే బెస్ట్ ఆప్షన్ అని ఫిక్స్ అయిన‌ట్టు స‌మాచారం. ఇంత కాలం అధ్యక్ష్య‌ పదవికి సంబంధించి పార్టీలో పాత, కొత్త నేతల పంచాయతీ నడిచింది. అయితే.. అధ్యక్షుడు కావడానికి ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేద‌ని ఇటీవల కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం కూడా ఈట‌లను దృష్టిలో పెట్టుకుని ఉంటుంద‌నే ఊహాగానాలున్నాయి. హైకమాండ్ నుంచి సంకేతాలు ఉండబట్టే ఆయన అలా మాట్లాడారని, ఈటలే ప్రెసిడెంట్ అనడానికి అవే సంకేతాలని పార్టీలోని కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement