భద్రాచలం మార్చి 30 (ప్రభ న్యూస్): భద్రాచలం రామాలయ అంతరాలయం కనపడేలా నుంచొని మాజీ ఎంపీ సీతారాం నాయక్ దిగిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. దేవాదాయ శాఖ అనుమతి లేకుండా ఎవరు కూడా అంతరాలయం ఫోటోలు తీసుకోవటం నిషిద్ధం. అయినప్పటికీ సీతారాం నాయక్ శనివారం నాడు రామాలయాన్ని సందర్శించుకుని తన సొంత వారితో అంతరాలయం బయట ఉండి అంతరాలయంలో ఉన్న స్వామివారి విగ్రహాలు కనపడేటట్టు ఫోటోలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో ఉంచటం రామ భక్తులు ఆక్షేపిస్తున్నారు.
ఇది అపచారమని, అక్కడ ఉన్న సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలంటూ స్థానికులు కోరుతున్నారు. ఒక బాధ్యత గల పదవిలో ఉండి, ప్రస్తుతం బిజెపి అభ్యర్థిగా మెహబూబాబాద్ పార్లమెంటరీ అభ్యర్థిగా ఉన్న సీతారాం నాయక్ చేసిన పని పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎదిఏమైనాప్పటికీ రామాలయ అంతరాలయ చిత్రాలు బయటికి రావటం సామాజిక మాధ్యమాల్లో కలకలం సృష్టిస్తుంది, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉంది.