చిట్కుల్లో ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు..
ఉమ్మడి మెదక్ బ్యూరో : నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని తమ పార్టీని ఫణంగా పెట్టి తెలంగాణ ప్రజలకు స్వరాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందని మెదక్ కాంగ్రెస్ సీనియర్ నేత నీలం మధు ముదిరాజ్ అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ 78వ జన్మదిన పురస్కరించుకొని చిట్కుల్లోని ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.
ఈసందర్భంగా నీలం మధు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని రాజకీయ ప్రకంపనలు వచ్చినా అన్నింటినీ తట్టుకుని తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యమకారుల దశాబ్దాల ఆకాంక్షలను నెరవేర్చిన దేవత సోనియాగాంధీదే అని కొనియాడారు. తల్లి సోనియమ్మ కృషితోనే అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్ర సాధనను సుసాధ్యం అయిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు.
సోనియా మీద అభిమానంతోనే, ఆమె త్యాగాలను గుర్తించి, తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రాన్ని ఇచ్చారన్న గౌరవంతో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారం కట్టబెట్టారన్నారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని ఇందిరమ్మను గుర్తుచేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందని వివరించారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయబడ్డ అన్ని వర్గాలను గుర్తించి సమ న్యాయం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.