హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఛత్తీస్గఢ్ బూటకపు ఎన్కౌంటర్ను నిరసిస్తూ ఈనెల 24న తెలంగాణ బంద్కు పిలుపు నిచ్చినట్లు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ గురువారం నాడు లేఖ విడుదల చేశారు. మార్చి 19న కోళ్లమరక అడవిలో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని ఆ లేఖలో తెలిపారు. ఈ బూటకపు ఎన్కౌంటర్కు నిరసనగా తెలంగాణ బంద్కు మేధావులు, అభ్యదయ వాదులు మద్దతివ్వాలని కోరారు.
పోలీసులు చేసిన హత్యల్లో మావోలు ప్రాణాలు కోల్పోయారని, ఈ ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న వారిపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి శిక్షించాలని కోరారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులో నలుగురు నక్సలైట్లు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. రేపన్పల్లి సమీపంలోని కోళ్లమర్క కొండల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో నక్సలైట్లు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు సైతం కాల్పులు జరపడంతో నలుగురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు.