దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు నివాళి
లాస్య, సాయన్న ఆశయ సాధనకు కృషి : సీఎం రేవంత్ రెడ్డి
లాస్య భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని భావించాం: కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశం మంగళవారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపం తీర్మానాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సునీతా లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, రాజశేఖర్ రెడ్డి, కేపీ వివేకానంద్ గౌడ్, కూనంనేని సాంబశివరావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, శ్రీ గణేశ్.. లాస్య నందిత మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ సీఎం రేవంత్ తీర్మానాన్ని బలపరిచారు.
ఇలాంటి తీర్మానం ప్రవేశపెట్టడం బాధగా ఉంది : రేవంత్ రెడ్డి
లాస్య నందిత మృతికి అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి తీర్మానం ప్రవేశపెట్టడానికి చింతిస్తున్నాని అన్నారు. దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదంలో మృతి చెందడం అత్యంత బాధకరమని చెప్పారు. లాస్య తండ్రి సాయన్న, తాను ఎమ్మెల్యేలుగా పనిచేశామని గుర్తు చేశారు. తండ్రి సాయన్న మరణంతో కుమార్తె లాస్య ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారని, మహిళలు తరుఫున పోరాడుతారని తాను భావించానని, ఇంతలోనే ఆమె మృతి చెందారన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజల హృదయాల్లో లాస్య, తండ్రి సాయన్న చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. వారిద్దరూ ఆశయం నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం ముందుంటుందన్నారు.
సాయన్న కుటుంబానికి అండగా ఉంటాం : కేటీఆర్
ఈ సందర్భంగా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. లాస్య నందిత భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని ఆశించాం.. కానీ ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది రోజులకే మరణించడం బాధాకరమని భావోద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్ నాయకత్వంలో సాయన్న కంటోన్మెంట్ అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. ఇదే శాసనసభలో కేసీఆర్ సాయన్న సంతాప తీర్మానం ప్రవేశపెట్టడమే కాకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారని, 2018 ఎన్నికల్లో లాస్య నందితకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామన్నారు. లాస్య నందిత మరణిస్తే తిరిగి వారి సోదరి నివేదితకు ఉప ఎన్నికల్లో అవకాశం ఇచ్చామని దురదృష్టావశాత్తు ఓటమి పాలైందని చెప్పారు. ఆమెకు సంతాపంగా మాట్లాడాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదన్నారు. సాయన్న కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చామన్నారు.
సమావేశం రేపటికి వాయిదా
అసెంబ్లీలో దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సంతాప తీర్మానాన్ని సీఎం ప్రవేశపెట్టారు. ఆమె మృతికి సంతాపంగా సభ్యులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.