Thursday, October 31, 2024

Telangana – బ‌డ్జెట్ భేటీకి రెడీ! కేంద్ర బ‌డ్జెట్‌పైనే ఫోక‌స్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాలను ఫిబ్రవరి మూడో వారంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. కేంద్రంలోని ఎన్డిఏ ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటు ఉభయ సభల్లో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కేటాయించే నిధులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ వార్షిక బడ్జెట్‌ అంచనాలను రూపొందించాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రానికి రావలసిన నిధులు జాతీయ స్థాయి ప్రాజెక్టులు రక్షణ శాఖకు చెందిన భూముల బదలాయింపు తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకు రాగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.

పాల‌మూరుకు జాతీయ హోదా ద‌క్కేనా?

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కూడా కోరిన సంగతి తెలిసిందే. అయితే జాతీయ హోదా విధానానికి స్వస్తి పలికామని, జాతీయ హోదా కల్పిస్తే అందుకు ఇచ్చే మొత్తం నిధులను మాత్రం ప్రభుత్వానికి విడుదల చేస్తామని, అయితే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి తనను కలిసిన సీఎం రేవంత్‌, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి హామీ ఇచ్చారు.

ఓటాన్ అకౌంట్‌లో చాన్స్ ఉండేనా?

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఉభయ సభల ముందుంచే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో పాలమూరు-రంగారెడ్డికి నిధులను కేటాయిస్తుందన్న నమ్మకంతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇలా ఆయా రంగాలకు నిధులను కేటాయించాలని కోరామని, కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్రం పెద్దపీట వేస్తుందన్న విశ్వాసంతో ఉన్న సీఎం రేవంత్‌ ఆ వివరాలు వచ్చాకే బడ్జెట్‌ రూపకల్పనకు నడుం బిగించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

- Advertisement -

ఈ దఫా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్టే?

తెలంగాణాలో కొత్తగా కొలువుదీరిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలా లేక ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్టా అనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఉభయ సభల్లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. అయితే ఏప్రిల్‌ నెలలో లోక్‌ సభ ఎన్నికలు జరుగుతుండడంతో ఈ నాలుగు నెలలు ప్రభుత్వ నిర్వహణకు ఈ దఫా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టాక అందులో పొందుపరిచే గణాంకాలను పరిగణలోకి తీసుకుని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్‌ను సిద్ధం చేసుకుంటాయి. కేంద్ర బడ్జెట్‌లో పొందుపరిచే గణాంకాలను పరిగణలోకి తీసుకుని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను రూపొందించే ఆనవాయితీ కొనసాగుతోంది.

పార్ల‌మెంట్ బాట‌లోనే తెలంగాణ ప్ర‌భుత్వం..
కేంద్ర ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ను పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే బాటలో ముందుకు వెళ్లాలని ప్రతిపాదించిందన్న ప్రచారం జరుగుతోంది. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ రూకల్పనపై అవసరమైన ప్రతిపాదనలు ఆర్థిక ప్రణాళిక శాఖలు సిద్ధం చేసినట్టు సమాచారం. జనవరి 9వ తేదీ లోపు శాఖల వారీగా బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు 52 పేజీలతో సిద్ధం చేసిన విధివిధానాలను ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు ఆయా శాఖలకు పంపించినట్టు చెబుతున్నారు. ఆయా శాఖల నుంచి బడ్జెట్‌ ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు చేరుతుండగా వీటన్నింటినీ క్రోడీకరించి నివేదిక సిద్ధం చేయనున్నట్టు సమాచారం.

ఆరు గ్యారెంటీల అమ‌లు కోసం ప్రాణాళిక‌లు..

ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల అమలుకు నిధులెన్ని అవసరమవుతాయన్న విషయంలో స్పష్టత ఇవ్వాలని ఇప్పటికే సీఎం రేవంత్‌ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కోరినట్టు సమాచారం. తెలంగాణాలో ప్రభుత్వం మారడంతోపాటు ప్రాధాన్యతలు కూడా మారడంతో గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలకు ఎంత మేర నిధులను కేటాయించారు? అందులో ఖర్చు చేసిందెంత? అన్న వివరాలను పరిశీలించి బడ్జెట్‌ను రూపొందించాలని భావిస్తున్నట్టు సమాచారం. కొత్త పథకాలను ఎప్పటి నుంచి అమలు చేయాలి? ఇందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత మేర నిధులవసరమన్నది కూలంకషంగా చర్చించి బడ్జెట్‌ను ప్రతిపాదించాలని భావిస్తున్నారు. అయితే పూర్తి స్థాయి బడ్జెట్‌కు అవసరమైన సమాచారాన్ని ఆర్థిక శాఖ తెప్పిస్తున్నా ఈ ఏడాదికి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

హామీల అమలెలా?

తెలంగాణాలో కొత్తగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చింది. వీటిని పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలన్న చర్చ జరుగుతోంది. లేని పక్షంలో ఆర్థిక ఇబ్బందులు ఉత్పన్నమవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే చెప్పిన ఈ గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని ప్రజలకు భరోసా ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాదిరిగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడితే గ్యారెంటీల అమలుతో పాటు ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన హామీలను నెరవేర్చేందుకు సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తుతాయని భావిస్తున్నట్టు సమాచారం. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెడితే పరిమితంగా కేటాయింపులు ఉంటాయని చెబుతున్నారు.

20 రోజులపాటు సమావేశాలు?

శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను ఇరవై రోజులకు తక్కువకాకుండా నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాల పునర్విభజన అంశంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో భారీగా అక్రమాలు తదితర అంశాలను చర్చిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement