Tuesday, November 26, 2024

Telangana – జంప్ జిలానీలు ఇంకెందరో? మండు వేస‌విలో పొలిటిక‌ల్ హీట్‌

ర‌స‌వ‌త్త‌రంగా మారిన‌ తెలంగాణ రాజ‌కీయం
వరుసబెట్టి కాంగ్రెస్‌లోకి లీడ‌ర్ల వలసలు
ఫలిస్తున్న రేవంత్ రాజకీయ ప్రయోగం
బీఆర్ ఎస్ నేత‌లంతా బీజేపీలోకి రావాల‌న్న కిష‌న్‌రెడ్డి
లోక్‌స‌భ వేళ ప‌లువురు కీల‌క నేత‌ల జంపింగ్‌లు
ఇవ‌న్నీ కామ‌నే అంటున్న బీఆర్ఎస్ నేత కేటీఆర్‌
ఉండేవారు ఉంటారు.. పోయేవారు పోతారని వెల్ల‌డి
హ‌త్య‌లుండ‌వు.. ఆత్మ‌హ‌త్య‌లేన‌న్న గులాబీ యువ ద‌ళ‌ప‌తి

హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు.. గోడ దూకడానికి సిద్ధమవుతున్న నేతల తీరు బీఆర్‌ఎస్‌ పార్టీకి తలనొప్పిగా మారింది. అధికారం దక్కించుకుని దూకుడుమీదున్న కాంగ్రెస్ పార్టీ.. తెరవెనుక ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలే లక్ష్యంగా పావులు కదుపుతున్న‌ట్టు స‌మాచారం. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్‌లో చేరారు. ఇలాంటి సమయంలో తమ పార్టీలోకి 20 నుంచి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారంటూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాంబ్ పేల్చారు. ఇక.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం దూకుడు పెంచింది. బీఆర్ఎస్ నేతలంతా బీజేపీలో చేరాలని పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానించారు. వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లలో గెలవాలనుకుంటున్న కమలం పార్టీ.. బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

హ‌త్య‌లు ఉండ‌వు.. ఆత్మ‌హ‌త్య‌లే..

తాజా పరిణామాలను పరిశీలిస్తే.. తెలంగాణలో బీఆర్ఎస్‌కు గ‌డ్డు కాలం న‌డుస్తున్న‌ట్టు ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆ పార్టీకి చెందిన నేతలు కొందరు బాహాటంగానే చెప్పేస్తున్నారు. గ్రామస్థాయి నేతల నుంచి ఎమ్మెల్యేల వరకు.. బీఆర్ఎస్ నేతలంతా బీజేపీలో చేరాలని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి బహిరంగంగానే పిలుపునిచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ బీఆర్ఎస్ నేతలకు ఆహ్వానం ప‌లికారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎవరైనా పార్టీ మారాలనుకుంటే వాళ్లిష్టం. కానీ, రాజకీయాల్లో హత్యలు ఉండవు.. కేవ‌తం ఆత్మహత్యలే ఉంటాయని స్ప‌ష్టం చేశారు. ఒకరిద్దరు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టం లేదన్నారు కేటీఆర్. ప్రభుత్వాలు మారగానే.. రాజకీయాలు మారడం సహజం అంటూ ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను స్ప‌ష్టం చేశారు.

లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు మ‌రింత హీట్‌..

ప్రతిపక్షంలో కూర్చోడానికి ఇబ్బంది పడే ఎమ్మెల్యేలు అధికారపక్షం వైపు రావడం కూడా చాలా కామన్. అయితే.. లోక్‌సభ ఎన్నికల ముందు ఈ జంపింగ్ ఎపిసోడ్.. రాజకీయాలను హీటెక్కిస్తోంది. నేను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని ఇటీవలే సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించగా.. అంతలోనే బీఆర్ఎస్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి బాటలోనే మరికొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారబోతున్నారని, దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారబోతున్నదనే ప్రచారం జ‌రుగుతోంది. కాగా, వంద రోజులు పూర్తిగా పాలనకే టైమ్ కేటాయించామని కానీ తమ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ ప్రతిరోజు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆ కుట్రలని తిప్పి కొట్టడంలో ఇక నా రాజకీయం ఏంటో చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈ రాజకీయ వేడిలో ఇంకా అనేకమంది పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement