Wednesday, November 20, 2024

తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ సెర్చ్ కమిటీ చైర్‌పర్సన్ ఇందిరా శోభన్​

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి కొత్త కమిటీని ప్రకటించింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దక్షిణ భారతదేశ ఇంచార్జి సోమనాథ్‌ భారతి, తెలంగాణ రాష్ట్రం కోసం సెర్చ్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సెర్చ్‌ కమిటీకి చైర్‌ పర్సన్‌గా ఇందిరాశోభన్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. మరో ఇద్దరిని సభ్యులుగా చేర్చినట్టు తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణలో ఇతర కమిటీలను నియమించే బాధ్యతలను సెర్చ్‌ కమిటీకి అప్పగిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో ఆమ్‌ ఆద్మీ పార్టీ బలోపేతానికి కొత్త నాయత్వం కృషి చేయాలని సూచించారు.

భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కొత్త నాయకత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని సోమనాథ్‌ భారతి ఆశాభావం వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు నిరాశ, నిస్పృహలతో ఉన్నారని అన్నారు. 7,651 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు, 13,500 మంది విద్యా వాలంటీర్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనాలోచిత నిర్ణయాలతో రోడ్డునపడ్డారని ఆరోపించారు. మనస్థాపంతో చాలా మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు, విద్యా వలంటీర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎంతో భవిష్యత్తు ఉన్న యువత, రైతులు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు.

తెలంగాణలోని సమస్యలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇప్పటికే దృష్టి పెట్టిందని చెప్పారు. 90 శాతం ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు విద్యా, వైద్యం అందకుండా పోయిందని అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకురావడం కేవలం ఆమ్‌ ఆద్మీ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. జాతీయ నాయకత్వం ఇప్పటికే తెలంగాణలో ఉన్న సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి సమాయత్తం కావాలని నాయకులకు పిలుపునిచ్చారు.

పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: ఇందిరా శోభన్
ఆమ్‌ ఆద్మీ పార్టీ తెలంగాణ సెర్చ్‌ కమిటీ చైర్‌ పర్సన్‌గా నియమితురాలైన ఇందిరా శోభన్ మాట్లాడుతూ పార్టీ కన్వినర్‌ కేజ్రీవాల్‌, సౌతిండియా ఇంచార్జి సోమనాథ్‌ భారతికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ఆమ్‌ ఆద్మీ పార్టీ బలోపేతానికి శక్తవంచనలేకుండా కృషి చేస్తానన్నారు. జాతీయ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఇందిరాశోభన్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement