Monday, November 18, 2024

Telangana – వర్షాలు, వరదలతో 5వేల కోట్ల నష్టం : రేవంత్

సూర్యాపేట – తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా 5వేల కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

ప్రకృతి విపత్తుగా గుర్తించి కేంద్రం తక్షణమే 2వేల కోట్లు రాష్ట్రానికి కేటాయించాలని కోరారు సీఎం. జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధాన మోదీని ఆహ్వానించామని సీఎం చెప్పారు. ఖమ్మం జిల్లాలో పర్యటనకు ముందు ఆయన తెలంగాణలో పోటెత్తిన వరదలు, సహాయక చర్యలపై సూర్యాపేటలో అధికారులతో సమీక్ష జరిపారు.

వర్ష ప్రభావిత జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లకు తక్షణ సాయం కోసం 5కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు సీఎం . .వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు.

- Advertisement -

చనిపోయిన పాడి గేదెలు ఒక్కో దానికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని 30 వేల నుంచి 50 వేల రూపాయలకు పెంచాలని, అలాగే మరణించిన మేకలు, గొర్రెలకు ఒక్కోదానికి ఇచ్చే 3 వేల సాయం 5 వేల రూపాయలకు పెంచాలని చెప్పారు. వర్షాలు, వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున పంట పరిహరం అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని సీఎం భరోసా ఇచ్చారు.భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. కలెక్టర్లు కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వ్యవస్థను సన్నద్దంగా ఉంచుకోవాలని చెప్పారు.

. భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలో 8 పోలీసు బెటాలియన్లను ఎన్డీఆర్‌ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు జరిగిన నష్టంపై అధికారులు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచాం.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు సీఎం.

Advertisement

తాజా వార్తలు

Advertisement