Friday, November 22, 2024

ఐటి ఆధారిత సేవ‌ల‌లో తెలంగాణ ర్యాం’కింగ్’..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సుపరిపాలనలో తెలంగాణ అద్భుత ప్రతిభతో మంచి ర్యాంకింగ్‌ వైపుగా దూసుకువెళుతోంది. నేషనల్‌ ఈ–గవర్నెన్స్‌ సర్వీసెస్‌ డెలివరీ అసెస్‌మెంట్‌ సర్వే ప్రకారం దేశంలో తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమ ప్రతిభను సొంతం చేసుకున్నది. పౌరసేవల్లో డిజిటల్‌ విధానాలు, పారదర్శకత అంశాల్లో దేశంలోనే 4వ స్థానంలో నిలిచింది. ఆయా రంగాల్లో పౌర సేవలు, డిజిటల్‌ సేవల్లో, వేగవంతమైన నిర్ణయాలు, వాటి అమలు, ప్రజాసంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడంలో పారదర్శకత, అవినీతి రహిత విధానాల వంటి పారామీటర్లలో ఉత్తమ స్థానాలను కైవసం చేసుకు న్నది. ఇలా ఆయా రంగాల్లో నిర్వహించిన సర్వేలో 2019తో పోలిస్తే 37శాతం పురోగతి సాధించింది.

ప్రధానంగా ఈ-గవర్నెన్స్‌లో అత్యుత్తమ మైలురాయికి చేరింది. ఈ రంగంలో దేశంలోనే రెండో ర్యాంకింగ్‌ను సాకారం చేసుకుంది. అత్యధిక సేవల్లో భాగంగా ప్రతి గ్రామంలో 1000 మందికి ఈ-ట్రాన్సాక్షన్లను అందించిన ఘనతను సాధించింది. ఈ-గవర్నెన్స్‌ రంగంలో నేరుగా 70 లక్షల మంది ప్రజలకు డైరెక్ట్‌ బెనిఫిట్‌ వర్తింప జేసింది. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య దళారీలు లేకుండా అనేక పథకాలలో పారదర్శకత అమలుకు డిజిటల్‌ విధానంలో లబ్ధిదారుల ఖాతాలకే బదలీ చేసింది.

డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల నిధులను పేదలు, వాస్తవ లబ్ధిదారులకు ఎటువంటి అక్రమాలు లేకుండా అందించింది. తద్వారా జాప్యంలేని, అవినీతిరహిత విధానాలకు అంకురార్పణ చేసింది. 2014 నుంచి ఇలా రాష్ట్రంలోని ప్రజానీకానికి రూ.1,10,824 కోట్లు డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ విధానంతో అందించింది రికార్డు సృష్టించింది.

పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా క్షేత్రస్థాయిలో జిల్లాలు, మడలాలు, రెవెన్యూ డివిజన్ల పునర్‌వ్యవస్థీకరణ అనేక రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారింది. పరిపాలనలో ఉత్తమ ఫలితాలు క్షేత్రస్థాయికి చేరి రాజధాని నుంచి క్షేత్రస్థాయికి నిర్ణయాల చేరిక, అమలు మరింత వేగవంతంగా మారింది. సేవల అందజేత సులభతరమైంది. తెలంగాణ అధికారిక పాలన అంతా ఎలక్ట్రానిక్‌ డిజిటలైజ్‌ చేసేందుకు సర్కార్‌ కార్యాచరణ చేసింది. కొత్త సచివా లయంలో ఈ మేరకు అన్ని అనువైన ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలను కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా డిజిటల్‌ రూపంలో కేంద్రీకృతం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సీఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌తోపాటు, సచివాయంలో ఈ అధునాతన సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుడుతున్నారు. పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సిస్టం ద్వారా అన్ని జిల్లాలు, కార్యాలయాల్లో డిజిటల్‌ కాన్ఫరెన్సింగ్‌ సౌకర్యాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు.

- Advertisement -

30 సచివాలయ శాఖలతోపాటు 113 శాఖాధిపతుల కార్యాల యాల్లో, 33 జిల్లా కలెక్టరేట్లు, పోలీస్‌ కార్యాలయాలు, 16 టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్‌లు, 1954 గ్లోబల్‌ ఆర్గనైజేషన్‌ యూనిటల్‌, 137 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 56 పాలిటెక్నిక్‌ కాలేజీలను డిజిటల్‌ పాలనలో అనుసంధానించారు. అన్ని శాఖల్లో టెండర్లు, కొనుగోళ్లకు ఈ ప్రొక్యూర్‌మెంట్‌ విధానాన్ని అమలు చేస్తోంది. రియల్‌టైం డిజిటల్‌ అథెంటికేషన్‌ ఆప్‌ ఐడెంటిటీతో 4 లక్షల ట్రాన్సాక్షన్లతో రూ.5 కోట్ల ఆదాయం ఆర్జించింది. టీవ్యాలెట్‌తో 73ప్రభుత్వ శాఖల్లో 1032 సేవ లందిస్తోంది. ఆర్టీఏలో ప్రతిష్టాత్మకంగా ఎం వ్యాలెట్‌ సేవలను, జీహెచ్‌ఎంసీలో మై జీహెచ్‌ఎంసీ యాప్‌, తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌ యాప్‌, ఆరోగ్యశ్రీ, రేషన్‌ వంటి వాటికి యాప్‌లతో ప్రజలకు సాంకేతిక సేవలను వారి ముంగిటకు తెచ్చింది. దేశంలోనే అనేక రంగాల్లో ఐటీ వినియోగంతోపాటు, ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా సెల్‌ఫోన్‌ లోని సేవలు పొందే వెసులుబాటును తెలంగాణ సర్కార్‌ విప్లవా త్మకంగా అమలులోకి తెచ్చింది. తద్వారా ప్రజలకు పాలన వేగంగా అందుబాటులోకి రావడంతోపాటు, జాప్యం తగ్గింది. అధికారుల్లో జవాబుదారీతనం పెరుగదలతోపాటు, లంచగొండితనం జాడలే కుండా పోతున్నది. తెలంగాణ అమలు చేస్తున్న పలు విధానాలు ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని ఆచరిస్తున్నాయి. అనేక పథ కాలు, పాలనా విధానాల్లో ఇది రుజువైంది. అందుకే ఆయా రంగాల్లో దేశంలోనే తెలంగాణ ముందంజలో నిలుస్తున్నది. పలు సంస్థలు, సర్వేలు ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement