కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని ఎంత అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆక్సిజన్ అందక దేశం అల్లాడిపోయింది. అయితే, స్థానికంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల ముందు చూపు, వేగంగా స్పందించటంతో కొన్ని రాష్ట్రాల్లో కరోనా భయానక వాతావరణం కాస్త తక్కువగా కనిపించింది. కరోనా సెకండ్ వేవ్ ను ఫేస్ చేయటంలో ఏ స్టేట్ బెటర్… ఏ స్టేట్ లాస్ట్ అన్న అంశాలపై లోకల్ సర్కిళ్స్ అనే సంస్థ చేసిన సర్వేలో జనం తమ అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టారు. నిర్మోహమాటంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. సర్వే ప్రకారం తమిళనాడు, ఏపీ ప్రభుత్వాలు కరోనాను అద్భుతంగా ఫేస్ చేశాయని జనం అభిప్రాయపడ్డారు. 59శాతం తమిళనాడు ప్రజలు ప్రభుత్వ పనితీరును మెచ్చుకోగా, ఏపీ ప్రభుత్వాన్ని 54శాతం ప్రజలు బాగా పనిచేశారని కితాబిచ్చారు. మూడు, నాలుగు స్థానాల్లో యూపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిలిచాయి. యూపీ సర్కార్ కు 51శాతం, మహారాష్ట్ర సర్కార్ కు 47శాతం మార్కులు పడ్డాయి. ఆ తర్వాత స్థానాల్లో గుజరాత్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు నిలిచాయి.
మొత్తం 17 రాష్ట్రాల్లో ఈ సర్వే చేయగా చిట్ట చివరన బెంగాల్ ఉంది. ఇక బీహర్, ఢిల్లీ రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరును కేవలం 20శాతం మంది ప్రజలు స్వాగతించగా… తెలంగాణ పనితీరు కేవలం 23శాతం మంది ప్రజలు బాగుందని అభిప్రాయపడ్డారు. అంటే 77శాతం మంది ప్రజలు తెలంగాణ ప్రభుత్వం కరోనాను ఎదుర్కొవటంలో ఫెయిల్ అయ్యిందని స్పష్టం చేశారు. తెలంగాణలో టెస్టింగ్, ట్రేసింగ్ సరిగ్గా జరగటం లేదని హైకోర్టు కూడా చాలా సార్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ సన్నద్ధతలను ప్రశ్నించింది. ప్రైవేటులో వైద్యం పేరిట లక్షలు వసూలు చేస్తుండటంపై మీరేం చేస్తున్నారని నేరుగా ప్రశ్నించింది.