మల్కాజిగిరిలో ఈటల
ముందుగా కట్టమైసమ్మ ఆలయంలో పూజలు
ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి
ఈటల గెలుపు ఖాయమన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కాంగ్రెస్, బీఆర్ ఎస్ ను చిత్తుగా ఓడించాలని ఈటల పిలుపు
మహబూబ్ నగర్ లో డి కె అరుణ
నాగర్ కర్నూలులో పి రాములు
మెదక్ లో రఘునందన్
నల్గొండలో శానంపూడిల నామినేషన్స్
ప్రభ న్యూస్ ప్రతినిధి మేడ్చల్ : ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాల్లో బీజేపీ విజయం సాధించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తాము ఎవరికీ బీ టీం కాదని చెప్పారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, మల్కాజిగిరి భాజపా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ ర్యాలీ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో 12కు పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈటలను గెలిపిద్దాం..
రాజకీయంగా ఈటల అనేక ఉద్యమాలు చేశారని.. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని చెప్పారు. మల్కాజిగిరిలో ఆయన్ను గెలిపిద్దామని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఐకమత్యంతో పనిచేయాలని కార్యకర్తలు, నేతలకు పిలుపునిచ్చారు. నామినేషన్ వేసిన తర్వాత డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని అధిష్ఠానం సూచించిందని.. కేడర్ అంతా ప్రచారంలో పాల్గొనాలన్నారు. ఇప్పటి వరకు దేశానికి ఏం చేశాం.. ఏం చేయబోతున్నామనేది ప్రజలకు వివరించాలని చెప్పారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా కీలకమని.. అక్కడ పార్టీ అభ్యర్థి వంశ తిలక్‌ను గెలిపించాలని కోరారు. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని.. ఈ విషయంలో తనకు పూర్తి విశ్వాసముందన్నారు. కాంగ్రెస్ ఏం చేసినా తమ గెలుపును ఆపలేదని చెప్పారు.
ఆ పార్టీలకు డిపాజిట్ గల్లంతే : ఈటెల
కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు డిపాజిట్ దక్కకుండా చేయాలని ఈటల ఓటర్లను కోరారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ఆర్ఓ గౌతం పొట్రు కు నేడు తన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నారన్నారని విమర్శించారు. ప్రజల నుంచి మోదీకి మంచి స్పందన వస్తుందని, అనేక వర్గాల ప్రజలు, సంఘాలు మరొక సారి మోడీని గెలిపించేందుకు మద్దతు ప్రకటిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా ముస్లిం మహిళలు కూడా మోదీకి పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తున్నారన్నారు. మోదీ వచ్చిన తర్వాతే దేశానికి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు పెరిగాయన్నారు.
కట్ట మైసమ్మ ఆలయంలో పూజలు
అంతకుముందు ఈటల తన నామినేషన్ పత్రాలను ఆయన సతీమణి జమునతో కలిసి శామీర్ పేట్ కట్ట మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు వీరేందర్ గౌడ్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శిల్పా రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, సామ రంగారెడ్డి , కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, బాషా, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
డీకే అరుణ, రఘునందన్ నామినేషన్
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. తొలి రోజు బీజేపీ అభ్యర్థులు రఘునందన్ రావు, డీకే అరుణ లు నామినేషన్ దాఖలు చేశారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ, మెదక్ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావు నామినేషన్ వేశారు. ఆలయాల్లో పూజలు చేసిన అనంతరం ర్యాలీగా వెళ్లి ఆయా జిల్లాల కలెక్టరేట్ లలో రిటర్నింగ్ అధికారులకు తమ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఇక కరీంనగర్ లోక్ సభ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థి కోట శ్యాం కుమార్, నిజామాబాద్ లోక్ సభ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకుడు రాపేల్లి సత్య నారాయణలు నామినేషన్ దాఖలు చేశారు.
నాగర్ కర్నూలు బిజెపి అభ్యర్థి…
అలాగే నాగర్ కర్నూల్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి పి.రాములు, నల్గొండ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి లు నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరి స్థానానికి ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందజేశారు.