Monday, November 18, 2024

తెలంగాణ‌కు పొంచి ఉన్న నీటి ఎద్ద‌డి – అడుగంటుతున్న‌ భూగ‌ర్భ జ‌లాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అతివృష్టి, అనావృష్టితో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు తల్లడిల్లు తున్నాయి. భారీ వర్షాలతో జలాశయాలు నిండి భూగర్భ జలాలు పెరిగాయని ఆనందపడిన రోజులనుంచి వేసవితాపంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయనే ఆందోళనలో నీటిపారుదల శాఖ నివేదికలు రూపొందిస్తుంది. ప్రధానంగా చెరువులు తక్కువగా ఉన్న ప్రాంతాలు, పారిశ్రామిక జోన్లు, మిషన్‌ కాకతీయలో చోటుదక్కని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. హైదరాబాద్‌ లో ని 10 ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాలోని 20 మండలాల్లో మేడ్చల్‌ , మల్కాజిగిరి లోని 7మండలాల్లో నీటి మట్టాలు తగ్గిపోయాయి. జనవరితో పోల్చితే సగటును రెండుమీటర్ల లోతుకు భూగర్భజలాలు వెళ్లినట్లు అధికారులు నివేదికలు రూపొందించారు. హైదరాబాద్‌ జిల్లా వ్యాప్తంగా సగటున 1.07 మీట్ల మేర,రంగారెడ్డి జిల్లాలో సగటున 0.64 మీటర్ల మేరతగ్గినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

శేరిలింగంపల్లిలో అత్యధికంగా 4.07 మీటర్లమేర నీటిమట్టాలు పడిపోయాయి. గతసంవత్సరం ఇక్కడ 8.62 మీటర్ల లోతులో నీరు ఉండగా ప్రస్తుతం 12.69మీటర్ల లోతులోకి నీరు వెళ్లిపోయింది. అయితే ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో బోర్లు ఎండిపోతున్నాయి. మేడ్చల్‌, మల్కాజిగిరి జిల్లాలో అల్వాల్‌ లో 9.13, దుండిగల్‌ 13.74, కూకట్‌పల్లిలో 13.53నుంచి 16.88, మల్కాజిగిరిలో 15,26, ఉప్పల్‌ లో 13 మీటర్ల లోతులోకి భూగర్భ జలాలు వెళ్లాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే సగటున రెండుమీటర్ల లోతులోకి వెళ్లినట్లు అధికారులు గమనించారు. రంగారెడ్డి జిల్లాలోను ఇదే పరిస్థితి ఉంది. అయితే దీనికి ప్రధానకారణం పట్టణాల్లోని చెరువులు పూడికతీతకు నోచుకోకపోవడం, పారిశ్రామీకరణ గా అధికారులు భావిస్తున్నారు. ఇక హైదరాబాద్‌ నీటిమట్టాలను గమనిస్తే మాసబ్‌ ట్యాంక్‌ లో 7.28 నుంచి 7.34, హుమాయున్‌ నగర్‌ 2.83 నుంచి 3.03, చంద్రాయణ గుట్ట 11.95 నుంచి 14.53,బహుద్దూర్‌ పురా 1.81 నుంచి 2.41, హిమాయత్‌ నగర్‌ 5.8 నుంచి 6.14, నాంపల్లి 3.81నుంచి 4.4, లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ 2.81 నుంచి 3.29 మీటర్ల మేరకు నీటి మట్టాలు తగ్గాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement