ప్రభన్యూస్: ఎట్టకేలకు విద్యాశాఖ అధికారులు క్యాడర్ స్ట్రెంగ్త్‌ను తేల్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ టీచర్ల లెక్కల వివరాల అంశం దాదాపు ఓ కొలిక్కి వచ్చిచ్చినట్లుగా తెలిసింది. ఇక గుర్తించిన పోస్టులను కొత్త జిల్లాల ప్రకారం అలకేషన్ చేయనున్నారు. అయితే పాఠశాల విద్యాశాఖ మినహా దాదాపు అన్ని డిపార్ట్‌మెంట్ల ఉద్యోగుల ఖాళీల వివరాలు ప్రభుత్వానికి ఇప్పటికే అందాయి. కానీ స్కూల్ ఎడ్యుకేషన్ వివరాలు ఇంకా ప్రభుత్వానికి చేరలేదు. దీంతో త్వరతగతిన ఈ ఖాళీలు, పోస్టుల వివరాలను తేల్చాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించడంతో దానికనుగుణంగానే నిన్న అన్ని జిల్లాల డీఈఓలతో క్యాడర్ స్ట్రెంగ్త్‌పై విద్యాశాఖ ఉన్నతాధి కారులు చివరి సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాల వారీగా ప్రస్తు తం పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, సాంక్షన్డ్ పోస్టులు, ఖాళీల వివరాలను ఉన్నతాధికారులకు ఆయా జిల్లాల డీఈవోలు సమర్పించినట్లుగా తెలిసింది.
వారు ఇచ్చిన లెక్కల ప్రకారం 1 లక్షా 20వేలు సాంక్షన్డ్ పోస్టులు, 1 లక్షా 2వేల మంది వరకు టీచర్లు ప్రస్తుతం పనిచేస్తున్నట్లుగా అధికారులు తేల్చారు. అలాగే 18వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లుగా పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. మీడియంల వారీగా, సబ్జెక్టుల వారీగా, స్కూళ్ల వారీగా, మేనేజ్‌మెంట్ల వారీగా ప్రతి పోస్టు వివరాలను క్షుణ్ణంగా తీసి ప్రభుత్వానికి ఆ నివేదికను ఒకటి రెండ్రోజుల్లో నివేదించనున్నట్లు సమాచారం.
డైట్, బీఈడీ కాలేజీల్లోని పోస్టు ల వివరాలు, ఎంఈవో, డీఈవో కార్యాలయాల్లోని పోస్టుల వివరా లను సైతం అధికారులు సేకరించారు. అయితే అధికారులు తేల్చిన లెక్కలను పరిగణలోకి తీసుకునే జిల్లాలకు పోస్టులను కేటాయించడంతో పాటు, ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. 70:30 నిష్పత్తిలో చేయనున్నట్లు తెలిసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital