Friday, November 22, 2024

TS: తెలంగాణ‌లో టీడీపీ మ‌ద్ద‌తు బీజేపీకే…

అధికారికంగా ప్ర‌క‌టించిన టీడీపీ
పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్
టీడీపీ నేత‌ల‌తో చింత‌ల జ‌రిపిన చ‌ర్చ‌లు స‌క్సెస్
10న హైద‌రాబాద్ లో జ‌రిగే మోదీ స‌భ‌కు
హాజ‌రుకానున్న టీడీపీ నేత‌లు
హైద‌రాబాద్ – తెలంగాణలో బీజేపీ పార్టీ దూకుడు మీదుంది. రీసెంట్‌గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లను గెలిచి మంచి ఊపుమీదున్న భారతీయ జనతా పార్టీ.. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఎక్కువ ఎంపీ సీట్లను గెలవాలనే ప్లాన్‌తో ముందుకు పోతుంది. ఇక లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 400 సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగింది. అటు బీజేపీ సొంతంగా 370 ఎంపీ సీట్లు గెలవాలనే టార్గెట్ పెట్టుకుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది.

ఏపీలో జనసేన, తెలుగుదేశంతో కలిసి కూటమిగా బరిలో దిగుతోంది. ఇక తెలంగాణలో ఒంటరిగా పోటీకి దిగింది. తాజాగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ బీజేపీకి బేషరతు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలంగాణ టీడీపీ నేతలతో చర్చలు జరిపారు. చ‌ర్చ‌ల అనంత‌రం తెలుగుదేశం పార్టీ.. తెలంగాణలో బీజేపీకి మద్ధతు ఇవ్వాలని నిర్ణ‌యించింద‌ని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణలో బీజేపీకి మద్ధతు ఇస్తున్నట్టు తెలిపారు.

బీజేపీ సీనియ‌ర్ నేత చింత‌ల మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో ఎలాంటి బేషజాలకు పోకుండా.. ప్రతి తెలుగుదేశం కార్యకర్త బీజేపీకి ఓటు వేసే విధంగా కృషి చేయాలని కోరారు. మన ఓటు ఇతరులకు వేస్తే నష్టం తప్ప ఇరువురికి ఎలాంటి లాభం ఉండదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఈ సందర్భంగా చింతల ఆకాంక్షించారు. ఈనెల 10న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ రానున్నార‌ని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం శ్రేణులు మోదీ పాల్గొనే బహిరంగ సభలో పాల్గొనాలని చింత‌ల ఆహ్వానించారు.. కాగా, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలోని 17 లోక్‌సభ సీట్లకు పోటీ చేస్తోంది. అటు ఏపీలో కూటమిలో భాగంగా 6 సీట్లలో బరిలో ఉంది. మొత్తంగా రెండు ఉభయ రాష్ట్రాల్లో 23 స్థానాల్లో పోటీ చేస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement