కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. రేణుకాచౌదరి, యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అనిల్‌కుమార్ యాదవ్‌కు పేర్లను ఖరారు చేస్తున్నట్లు ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అలాగే కర్ణాటక నుంచి సైతం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీట్లు- ఖరారు చేసింది. అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ పేర్లు ప్రకటించింది.
మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అశోక్‌సింగ్ పేరు ఏఐసీసీ ఖరారు చేసింది. తెలంగాణ నుంచి ఏఐసీసీ కోటాలో ఒకరికి అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినా చివరకు రెండు సీట్లకు రాష్ట్రం నుంచే ఎంపిక చేశారు. రాజ్యసభకు ఎంపికైన అభ్యర్థులు గురువారం నామినేషన్లు వేయనున్నారు.
కాగా, కాంగ్రెస్ పార్టీకి వచ్చే రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి ఓసీకి, ఇంకొకటి బీసీకి అవకాశం కల్పించారు. మాజీ మంత్రులు జానారెడ్డి, చిన్నారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, పీసీసీ ఉపాధ్యక్షులు జి. నిరంజన్ పేర్లు కూడా వినిపించినప్పటికి.. చివరకు రేణుకాచౌదరి ( కమ్మ), అనిల్‌కుమార్ యాదవ్ ( బీసీ) లకు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఇటీవలనే ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బల్మూరి వెంకట్ ( ఓసీ వెలమ), మహేష్‌కుమార్‌గౌడ్ ( బీసీ), గవర్నర్ కోటాలో కోదండరామ్ ( రెడ్డి), అమిర్‌అలీఖాన్ ( మైనార్టీ)లకు అవకాశం ఇచ్చారు. అయితే గవర్నర్ కోటాలో ఎంపికైన వారి అభ్యర్థిత్వాల విషయంలో కోర్టులో కేసు నడుస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, తెలంగాణ నుంచి ప్రకటించిన అభ్యర్థులు మాజీ మంత్రి రేణుకాచౌదరి ఖమ్మం లోక్‌సభ టికెట్ కోసం, అనిల్‌కుమార్ యాదవ్ సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేయాలని భావించినప్పటికి.. రాజ్యసభ సీటు కోసం కూడా ప్రయత్నం చేసుకుని సాధించుకున్నారు. అనిల్‌కుమార్ యాదవ్ తండ్రి అంజన్‌కుమార్ యాదవ్ అసెంబ్లి ఎన్నికల్లో ముషిరాబద్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటి చేసి ఓటమి చెందారు. అంతకు ముందు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత రెండు పర్యాయాలు సికింద్రాబాద్ లోక్‌సభకు పోటీ చేసి ఓటమి చెందారు. ఇక రేణుకాచౌదరి కూడా ఖమ్మం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు మరోసారి పోటీకి ఆసక్తి చూపగా.. కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభకు అవకాశం కల్పించింది.
ఎస్సీ, ఎస్టీలకేది ప్రాతినిధ్యం..
రాజ్యసభ, శాసన మండలి సభ్యుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అవకాశ దక్కకపోవడంపై ఆ వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో ఓట్లు కావాలని, సీట్లు మాత్రం ఇవ్వడం లేదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లిd, లోక్‌సభకు రిజర్వేషన్లు లేకపోతే.. అక్కడ కూడా అన్యాయం జరిగేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.