Saturday, November 23, 2024

నేరాల నియంత్రణలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్న త‌రుణ్ జోషి

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : నేరాలను నియంత్రించడంతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించడంలో ప్రజలు సైతం పరోక్షంగా భాగస్వాములు కావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి ప్రజలకు పిలుపునిచ్చారు. గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల భాగస్వామ్యంతో రెడ్డి పాలెంలో నూతనంగా ఏర్పాటుచేసిన 32 సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ సోమవారం ప్రారంభించారు. గీసుకొండ పోలీసుల పిలుపు మేరకు గ్రామ భద్రత కోసం గ్రామంలోనికి వచ్చి పోయే మార్గాల్లో నెలకొల్పబడిన సీసీ కెమెరాలకు సంబంధించిన‌ దృశ్యాలను పోలీసులు నేరుగా పరిశీలించే విధంగా కెమెరాలను గీసుగొండ సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు.

ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి మాట్లాడుతూ… గత కొన్ని సంవత్సరాలుగా రెడ్డి పాలెం నుండి పోలీస్ స్టేషన్ కు ఒక్క ఫిర్యాదు రాకపోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో రెడ్డి పాలెం అదర్శ గ్రామంగా గుర్తింపు సాధిస్తుందన్నఆకాంక్షను వెలిబుచ్చారు. అలాగే నేరాల నియంత్రించడంతో పాటు నేరస్తులను గుర్తించడంలో సీసీ కెమెరాలు చాలా కీలకంగా నిలుస్తాయన్నారు. ఒక వేళ నేరం జరిగిన కొద్ది గంటల్లో నేరస్థులను పట్టుకోవడంతో పాటు వారి నేరాన్ని కోర్టులో నిరూపించేందుకు సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయ‌న్నారు. గత మూడు సంవత్సరాల నుండి రాష్ట్రంలో చైన్ స్నాచింగ్, దొంగతనాలతో పాటు ఇతర నేరాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రజా భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతోనే నేరాలను నియంత్రించడం సాధ్యపడిందని పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, మామూనూర్ ఏసీపీ నరేష్ కుమార్, గీసుగొండ ఇన్ స్పెక్ట‌ర్ రాయల.వేంకటేశ్వర్లు, ఎస్.ఐ దేవేందర్, రెడ్డి పాలెం గ్రామస్తులతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement