పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామం వద్ద పదవ తరగతి పరీక్ష రాయడానికి వెళ్తున్న విద్యార్థుల టాటా ఏస్ వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఆటో నడుపుతున్న డ్రైవర్ కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో అదుపు తప్పిన వాహనం ఒక్కసారిగా మురికి కాలువలోకి దూసుకెళ్లింది. అయితే ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకా పోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ప్రతిరోజు నంది మేడారం బాలికల గురుకుల పాఠశాల నుండి అదే గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు దాదాపు 20 మంది వరకు విద్యార్థినీలు పదవ తరగతి పరీక్షలు రాసేందుకు వెళ్తున్నారు. మంగళవారం కూడా పరీక్షల కోసం ఆటోలో వెళ్తుండగా డ్రైవరకు ఫిట్స్ వచ్చి ఆటో ఒక్కసారిగా పక్కనే ఉన్న మురికి కాలువలోకి దూసుకెళ్లింది. చికిత్స నిమిత్తం డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. కాగా, టాటా ఏస్ వాహనంలో ఏడుగురిని తీసుకెళ్లే సామర్థం ఉండగా, ఏకంగా 20 మంది విద్యార్థులను ఎక్కించడం విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులకు ప్రమాదం జరిగితే ఎవరి భాద్యత అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.