వరంగల్ క్రైమ్ : తెలంగాణ సర్కార్ నిషేధించిన గుట్కా, పొగాకు ఉత్పత్తుల అక్రమ రవాణా యధేచ్చగా, నిరాటంకంగా సాగుతూనే ఉంది. గుట్కా స్మగ్లర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొంటున్నారు. గుట్కా మాఫియా తమ దందాకు ముగింపు పలుకకుండా కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం నిషేధం విధించిన పొగాకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్నట్టు వరంగల్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ సంతోష్ నేతృత్వంలో దాడులు చేశారు. వారి వద్ద నుండి 4 లక్షల 26 వేల 5 వందల విలువ చేసే పొగాకు ఉత్పత్తుల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురు గుట్కా స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు స్మగ్లర్లు పరారీలో ఉన్నారు. ఒక ఇటియాస్ కారు, ఒక ఆటో, రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. మడికొండ కు చెందిన రవికంటి.చంద్ర శేఖర్( 55), స్టేషన్ ఘన్ పూర్ మండలం రాఘవపూర్ కు చెందిన చింతకింది నరేందర్ (33), కాజీపేట, విష్ణుపురి కి చెందిన ఎంజాల దేవేందర్ లను అరెస్ట్ చేశారు. దేశాయ్ తండా కు చెందిన భూక్య సురేష్, భూక్య వెంకటేష్ లు పరారీలో ఉన్నారు. స్టేషన్ ఘన్ పూర్ చుట్టూ పక్కల ప్రాంతాల్లో గుట్కా, పొగాకు ఉత్పత్తులను బీదర్ నుండి అక్రమ రవాణా ద్వారా దిగుమతి చేసుకొంటూ అమ్మకాలు సాగిస్తున్నారు. గుట్కా స్మగ్లర్లంతా పాత కాపులు కావడం, వారిపై గుట్కా అక్రమ విక్రయాలు జరిపిన కేసులు ఉన్నాయి. తదుపరి చర్యల కోసం చిల్పూర్ పోలీసులకు అప్పగించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital