Tuesday, November 26, 2024

పొగాకు ఉత్పత్తుల డెన్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి : న‌లుగురు అరెస్ట్

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : తెలంగాణ సర్కార్ నిషేధించిన గుట్కా, పొగాకు ఉత్పత్తుల దందాను కొనసాగిస్తున్న పేరుమోసిన స్మగ్లర్ బండారాన్ని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. నెలకు ఏడేనిమిది మార్లు తన స్విఫ్ట్ డిజైర్ లో బీదర్ కు వెళ్లి నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు కలిగిన 15 బ్యాగుల సరుకును అక్రమంగా తీసుకొస్తూ, పెద్ద ఎత్తున సొమ్ము చేసుకోంటున్నాడు. అదీ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే నిషేధిత ఉత్పతుల డెన్ ఏర్పాటు చేసి, యద్దేచ్చగా, నిరాటంకంగా పోలీసుల కళ్ళు గప్పి, జోరుగా వ్యాపారం సాగిస్తూ ప్రభుత్వ నిర్ణయానికి తూట్లు పొడుస్తున్నాడు. కొన్నేళ్లుగా తన అక్రమ వ్యాపారాన్ని నర్సంపేట పట్టణంలోనే కాక, చుట్టుపక్కల గ్రామాలతో పాటు, మహబూబాబాద్ జిల్లాలోని ప్రాంతాలతో పాటు వరంగల్ నగరం లోనూ గుట్కా, పొగాకు ఉత్పత్తులను గుట్టుగా విక్రయిస్తూ పోలీసులకు సవాలుగా నిలిచిన గుట్కా స్మగ్లర్ బండారాన్ని ఎట్టకేలకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కనిపెట్టి కట్టడి చేశారు. వరంగల్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ పర్యవేక్షణలో, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్ట‌ర్ సీహెచ్ శ్రీనివాస్ జీ నేతృత్వంలో దాడి చేశారు. నర్సంపేట పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోని నిషేధిత ఉత్పత్తుల డెన్ పై దాడి చేసి 14 లక్షల 17 వేల రూపాయల విలువ జేసే సరుకును స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమ రవాణా దిగుమతికి ఉపయోగించే స్విఫ్ట్ డిజైర్, రెండు టాటా ఎస్ ట్రాలీలు, ఒక స్మార్ట్ ఫోన్ ను సీజ్ చేశారు.

పెద్ద ఎత్తున నిషేధిత పోగాకు ఉత్పత్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొన్నారు. అక్రమ వ్యాపారం చేస్తున్న న‌లుగురిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు కిలాడీలు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. 27 సంచుల అంబర్ పొగాకు సంచులు, రెండు ఆర్ ఆర్ బ్యాగ్స్, 195 ప్యాకెట్ల జెకె జర్ధా, 35 ప్యాకెట్ల అంబర్ ప్యాకేట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. స్విఫ్ట్ డిజైర్ (ఎపి 36 ఏ జెడ్ 7388) టాటా ఎస్ ఆటో ట్రాలీ ( ఎపి26 టి 4461, టీఎస్ 26 టి 5834) లను సీజ్ చేశారు. నర్సంపేట పట్టణంలోని సాయి నగర్ కు చెందిన పుల్లూరి జితేందర్ ఇంటిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. గుట్కా స్మగ్లర్ జితేందర్ పై 4 కేసులు నర్సంపేట పోలీస్ స్టేషన్ లో ఒక కేసు మట్టేవాడ పోలీస్ స్టేషన్ల లో నమోదయ్యాయి. జితేందర్, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడకు చెందిన వలుపదాసు శ్రీనివాస్, వలుపదాసు వెంకట నారాయణ, వలుపదాసు సాంబశివుడులను అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ కు రత్న శేఖర్, కంబాలపల్లికి చెందిన డ్రైవర్ మహేష్, బీదర్ కు చెందిన అహ్మద్ లు పరారీలో ఉన్నారు. తదుపరి చర్యల కోసం నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును నర్సంపేట పోలీసులకు అప్పగించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement