హైదరాబాద్, ఆంధ్రప్రభ : వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో కాషాయజెండా ఎగురువేయాలనే లక్ష్యంతో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా తెలంగాణ బీజేపీ కొత్త ఇన్చార్జ్గా సునీల్ బన్సాల్ నియమించింది. తెలంగాణలో అసెంబ్లి ఎన్నికలకు సమయం దగ్గరపడటం, ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుండటంతో బీజేపీ అధిష్టానం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. 2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్‌కు ఉద్వాసన పలికి సునీల్ బన్సాల్‌ను నియమించింది. ఈ మేరకు బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు.
ప్రస్తుతం బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న బన్సల్‌కు తాజాగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు. అలాగే ఆయనకు తెలంగాణ బీజేపీ పార్టీ శాఖ ఇన్చార్జ్ బాధ్యతలతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా బీజేపీ శాఖల ఇన్చార్జ్గా నియమించారు. కేంద్రహోంమంత్రి అమిత్ షాకు బీజేపీ కొత్త ఇన్చార్జ్గా నియమితులైన సునీల్ బన్సాల్ అత్యంత సన్నిహితుడుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేందుకు ముందుకు పోతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రం కీలకంగా మారింది. హైదరాబాద్ నడిగడ్డగా ఎన్నికల వ్యూహం రచిస్తున్నది. ఇప్పటికే తెలంగాణలో జరిగిన అసెంబ్లి ఉప ఎన్నికల్లో నాగార్జున సాగర్ మినహా దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించి అధికార టిఆర్ఎస్ పార్టీని మట్టికరిపించింది.
ప్రస్తుతం మునుగోడులో జరగనున్న ఉప ఎన్నికను సెమీ ఫైనల్స్‌గా బీజేపీ భావిస్తుంది. ఈ క్రమంలో విజయం కోసం బీజేపీ శ్రేణులు సర్వశక్తులను ఒడ్డుతున్నారు. తనకున్న అన్ని అవకాశాలను వాడుకుంటూ అధికార టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో ప్రజా సంగ్రామ యాత్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సాగిస్తున్నారు. ఈనెల 21న మునుగోడులో కేంద్రమంత్రి అమిత్ షాతో భారీ బహిరంగ సభ బీజేపీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా ఇతర పార్టీల నుంచి కీలక నాయకులను బీజేపీలో చేర్చుకునేందుకు కసరత్తు చేస్తుంది.