Wednesday, November 20, 2024

TG: గ‌ణేష్ మండ‌పాల వ‌ద్ద జాగ్ర‌త్త‌లు తీసుకోండి… నిర్వాహకులతో బండి సంజయ్

ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ : రాబోయే వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, గణేష్ మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. నవరాత్రి ఉత్సవాల్లో అధికారులు అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, అధికారుల సమన్వయ సమావేశాన్ని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ… కరీంనగర్ గణేష్ ఉత్సవాల్లో ఎటువంటి ఘటనలూ జరిగిన చరిత్ర లేదని, నిర్వాహకులు ఆ ఆనవాయితీని కొనసాగించాలని కోరారు. ఉత్సవాలకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే అనవసరమైన వీడియోలను, ఫోటోలను ట్రోల్ చేయవద్దని సూచించారు. నవరాత్రి ఉత్సవాలకు కావలసిన అన్నిరకాల ఏర్పాట్లను సమయానికి ముందే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఏర్పాట్ల విషయంలో ప్రైవేట్ వ్యక్తులు సంస్థల సహాయం కూడా తీసుకోవాలని అన్నారు. కరీంనగర్ లోని గణేష్ మండపాలకు అవసరమైన విద్యుత్ బిల్లును తాను చెల్లిస్తానని పేర్కొన్నారు. 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని, మండపాల్లో నిర్వాహకులు తప్పనిసరిగా ఉండాలని కోరారు. సంస్కృతిని పండుగను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ… పోటీగా కాకుండా భక్తితో భగవంతున్ని పూజించాలని కోరారు. మట్టి గణపతిలను ప్రతిష్టించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని సూచించారు. ఉత్సవాలకు కావలసిన అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. గ్రీన్ గణేశా విగ్రహలను ప్రోత్సహించాలన్నారు. పీఓపీ విగ్రహాలతో ఎన్నో అనర్థాలు ఉన్నాయని, ప్రజల్లో అవగాహన కల్పించి, చైతన్యం తేవాలన్నారు. పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి నిర్వాహకులు ముందుగా పోలీసు అనుమతి తీసుకోవాలన్నారు.

- Advertisement -

రోడ్డుకు అంతరాయం లేకుండా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. శబ్ద కాలుష్యం ఉపయోగించకూడదన్నారు. రాత్రి వేళ మండపాల వద్ద కమిటీ సభ్యులు కాపలా ఉండాలన్నారు. నిమజ్జనానికి సంబంధించిన రూటు మ్యాప్‌ను ముందే తెలియజేయాలన్నారు. ఊరేగింపుల్లో బాణసంచా ఉపయోగించరాదని, డీజే శబ్దాలు, అశ్లీల డ్యాన్సులు నిరోధించాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కల్గించకూడదన్నారు. పోలీస్‌ శాఖ సూచనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసే మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పేయి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, గణేష్ మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా పోలీస్ అధికారులు వినాయక చవితి ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement