Wednesday, November 20, 2024

అగ్నిప‌థ్ నిర్ణ‌యం వాప‌స్ తీసుకోండి.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కు బోయిన‌ప‌ల్లి లేఖ

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ శనివారం లేఖ రాశారు. ఇండియన్ ఆర్మీలో కొత్తగా అగ్నిపథ్ పథకాన్ని తీసుకు రావాలన్న నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకుని దేశంలోని యువతలో భరోసా పెంచాలని ఆయన అన్నారు. ప్రధాని మోడీ చర్యలు యువత ఆశలను నీరుగార్చే విధంగా ఉన్నాయని వినోద్ కుమార్ లేఖ‌లో పేర్కొన్నారు. ఇది ఏమాత్రం క్షేమకరం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

అగ్నిపథ్ పథకం దేశంలోని యువతలో అగ్గి రాజేష్తోందని, ఇది దేశ భద్రతకు శ్రేయస్కరం కాదని వినోద్ కుమార్ అన్నారు. మోడీ ప్రభుత్వం మొదటి నుంచి అనాలోచిత నిర్ణయాలతో దేశ ప్రజలకు గందరోళానికి గురి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆర్మీ లో కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు జరపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తనకు ఆశ్చర్యానికి గురి చేస్తోందని, కేంద్ర ప్రభుత్వ ఇలాంటి నిర్ణయంతో తన హృదయం గాయ పడిందని వినోద్ కుమార్ తెలిపారు. భారత సరిహద్దుల్లో ప్రమాదకర పొరుగు దేశాలు పొంచి ఉన్నాయని, జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శత్రువులతో ప్రమాదం ఉంటున్న ఇలాంటి సమయంలో ఆర్మీలో అగ్నిపధ్ వంటి పథకం అమలులోకి తీసుకుని రానుండటం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు అని వినోద్ కుమార్ వివరించారు.

అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలలో మిలటరీ శిక్షణ తప్పనిసరి అని, అందుకోసం ఆయా దేశాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఆర్మీ రిక్రూట్మెంట్ జరుగుతుందని వినోద్ కుమార్ గుర్తు చేశారు. అలాంటి పరిస్థితులు దేశంలో లేవని, ఆ దేశాల పద్దతులను నకలు చేస్తే ఎలా..? అని ఆయన ప్రశ్నించారు. జై జవాన్.. జై కిసాన్ నినాదం భారత దేశం నినాదమని, ఆ నినాదాన్ని మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని అన్నారు. లాభాల బాటలో బ్రహ్మాండంగా సాగుతున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అయిన‌ రైల్వే, ఎల్ఐసి, బి.ఎస్.ఎన్.ఎల్., బి.హెచ్.ఇ.ఎల్., బ్యాంక్స్, వివిధ ఆయిల్ కంపెనీలు, ఈ.సీ.ఐ.ఎల్. వంటి అనేక సంస్థలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందని, ఆ కుట్రలో భాగమే అగ్నిపథ్ నిర్ణయం తీసుకుందని వినోద్ కుమార్ అన్నారు.

మోడీ ప్రభుత్వం ప్రతిసారి సాయుధ బలగాలను ఎగతాళి చేస్తున్నారని, ఇది ఏమాత్రం మంచిది కాదని బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా రాజుకుంటున్న ఆగ్రహ జ్వాలలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా అగ్నిపథ్ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని వినోద్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement