న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు గిట్టనివారిపై ఓ రెండు పత్రికలు (ఆంధ్రప్రభ కాదు), ఓ టీవీ న్యూస్ చానెల్ విషం చిమ్ముతున్నాయని భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేతలు ఆరోపించారు. పార్లమెంటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి, రాష్ట్ర ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని, భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని వారు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఆకస్మికంగా ఢిల్లీ బయల్దేరి వచ్చిన నేతలు బుధవారం ఉదయం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్‌ను ఆయన నివాసంలో కలిశారు. సమావేశమైనవారిలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అరవింద్, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎన్.రామచంద్రరావు, కేంద్ర జలవనరుల విభాగం సలహాదారు వెదిరె శ్రీరాం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కోశాధికారి శాంతికుమార్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు సీహెచ్.విఠల్ ఉన్నారు.
మీడియా సంస్థల వ్యవహారంతో పాటు రాష్ట్ర పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై చర్చించారు. అనంతరం అక్కణ్ణుంచి నేరుగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసానికి చేరుకున్నారు. ఆ సమయానికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, రాష్ట్ర సమన్వయకర్త నూనె బాలరాజ్ కూడా అక్కడికి చేరుకున్నారు. పార్లమెంటులో ప్రధాని చేసిన వ్యాఖ్యలను వక్రీకరించిన ఆ మీడియా సంస్థలపై పార్లమెంటరీ నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలని కోరుతూ కేంద్ర మంత్రికి ఓ వినతి పత్రం అందజేశారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఆయన ఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో స్పీకర్ కార్యాలయంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు కాపీని అందజేశారు.
గిట్టనివారిపై విషం – ఆ పత్రికల నైజం: బండి సంజయ్
అంతకు ముందు తరుణ్ చుగ్ నివాసంలో మీడియా మాట్లాడిన బండి సంజయ్.. సీఎం కేసీయార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన చెప్పుచేతల్లోని మీడియా సంస్థల ద్వారా గిట్టని పార్టీలు, నేతలు, తెలంగాణ ఉద్యమకారులు, మీడియా సంస్థలపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. ప్రకటనల పేరుతో వందల కోట్ల రూపాయలు ఆయా మీడియా సంస్థలకు కేటాయిస్తూ సర్కారు ఖజానాకు గండి కొడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా చాలా రోజులుగా బీజేపీ పోరాడుతోందని, అందుకే కేసీయార్ అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ద్రోహులను కేసీఆర్ చేరదీస్తున్నారని, తెలంగాణ ఉద్యమ చరిత్రను కనుమరుగు చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వాస్తవాలను కప్పిపుచ్చుతూ, అవాస్తవాలను నిజాలుగా ప్రచారం చేస్తున్నారని, ఇతర మీడియా సంస్థలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో ఆలీబాబా 40 దొంగలు: తరుణ్ చుగ్
అనంతరం మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ బీజేపీ రోజురోజుకూ బలోపేతమవడం చూసి తీవ్ర అసహనానికి, ఆందోళనకు గురవుతూ బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు చేయిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఒక మునిగిపోతున్న పడవ అని, దాన్ని కాపాడుకోవడం కోసం కేసీయార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదని, ఎందుకంటే తెలంగాణ ప్రజలు పూర్తిగా ఆయనకు వ్యతిరేకంగా మారిపోయారని తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని తెలంగాణ ప్రజానీకం నిర్ణయించుకుందని వ్యాఖ్యానించారు. కేసీయార్ అవినీతి ముఖ్యమంత్రిగా మారిపోయారని, కేసీఆర్‌తో పాటు ఆయన మంత్రివర్గం ఆలీబాబా 40 దొంగల ముఠాలా మారిపోయిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న డబ్బును ఏవిధంగా దోచుకోవాలి అనే అంశంమీదనే ఆ ముఠా దృష్టి పెట్టిందని మండిపడ్డారు.