- నాలుగు లక్షల బిల్లు
- డబ్బులు కట్టిన తర్వాత బంధువుల చేతికి శవం
- చనిపోయింది కూడా డాక్టరే
- హాస్పటల్ ముందు బంధువుల ఆందోళన
హైదరాబాద్ – ఠాగూర్ సినిమాలో ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి శవానికి చికిత్స చేసి రోగి వద్ద రూ.లక్షలు వసూలు చేసిన సీన్ గుర్తుందా.. సరిగ్గా హైదరాబాద్ లోని మాదాపూర్ లో కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి చనిపోయిన రోగికి బుధవారం ఉదయం కూడా వైద్యులు చికిత్స చేశారు. అప్పటికే రూ.3 లక్షలు కట్టిన బంధువులను చికిత్స ఆపేస్తామని బెదిరించి మరీ మరో లక్ష వసూలు చేశారు. డబ్బులు కట్టిన కాసేపటికే సారీ చెబుతూ డెడ్ బాడీని అప్పగించారు. ఈ ఘటనలో మరో దారుణమైన సంగతేంటంటే.. చికిత్స పొందుతూ చనిపోయింది కూడా ఓ డాక్టరే.. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..
హైదరాబాద్ కు చెందిన జూనియర్ డాక్టర్ నాగప్రియ ఇటీవల అనారోగ్యం పాలయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను మాదాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అడ్వాన్స్, మందుల చార్జీలు, వైద్య పరీక్షలకు మంగళవారం నాటికే 3 లక్షల రూపాయలు చెల్లించారు. అయితే, మంగళవారం రాత్రి పరిస్థితి విషమించడంతో నాగప్రియ చనిపోయారు. ఈ విషయాన్ని దాచిన డాక్టర్లు . నాగప్రియకు చికిత్స కొనసాగిస్తున్నట్లు నటించారు. బుధవారం ఉదయం మరో లక్ష రూపాయలు కట్టాలని, లేదంటే చికిత్స ఆపేయాల్సి వస్తుందని బెదిరించారు. దీంతో అతికష్టమ్మీద డాక్టర్లు అడిగిన సొమ్మును నాగప్రియ కుటుంబ సభ్యులు చెల్లించారు.
డబ్బు కట్టిన రశీదు చూశాక వైద్యులు తమ నాటకానికి ముగింపు పలికారు. ఎంత ప్రయత్నించినా నాగప్రియ ప్రాణాలను కాపాడలేక పోయామని, డెడ్ బాడీని తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో ఆగ్రహించిన నాగప్రియ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. డబ్బుల కోసమే నాగప్రియ మరణించిందనే విషయం తమకు చెప్పకుండా దాచారని మండిపడ్డారు.