Saturday, November 23, 2024

రాజకీయాల్లో తిట్లు సరికాదు.. తెలుగు భాషను కాపాడుకుందాం: సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తొలి ఐదేళ్లు మాతృ భాషలో చదివిన వాళ్లే మేధావి అయ్యారని మహారాష్ట్ర పూర్వ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ తెలిపారు. అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం సందర్బంగా అక్షరయాన్‌ ఆధ్వర్యంలో బేగంపేట్‌లోని హరిత ప్లాజా హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పూర్వ గవర్నర్‌ ప్రసంగిస్తూ ప్రతి ఊర్లో, ప్రతి పాఠశాలలో మాతృ భాషను నిర్లక్ష్యం చేయరాదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషను 5వ తరగతుల వరకు తప్పనిసరి చేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులకు సూచించారు. రాజకీయాల్లో తిట్లు సరి కాదన్నారు. నేతల భాష పిల్లలపై ప్రభావం చూపుతుందన్నారు. రాజకీయ నేతలంటే విమర్శలు, ప్రతి విమర్శలు సహజమన్నారు. కానీ సభ్యసమాజం స్వీకరించేందుకు సిద్దంగా లేని భాషను వాడటం బాగాలేదన్నారు. భాష విషయంలో నేతలు పునరాలోచన చేసుకోవాలన్నారు.

తెలుగు అంతర్జాతీయ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. కరోనా, ఒమిక్రాన్‌ వంటి సమయాల్లో గ్రామీణ ప్రజలకు సాంకేతిక ద్వారా మాతృ భాషలో అవగా#హన ఏర్పడిందంటూ మాతృ భాష ఆవశ్యకత గురించి వివరించారు. ఈ సందర్బంగా ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌కు పంపన కవి పురస్కారంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షులు తంగెడ కిషన్‌ రావు, ఐనంపూడి శ్రీలక్ష్మి, చాలామంది తెలుగు కవులు కవయిత్రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement