హైదరాబాద్, ప్రభన్యూస్: ఇంజినీరింగ్ కోర్సులకు ఉమ్మడి ఫీజు విధానాన్ని అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర విద్యాశాఖ ఈ మేరకు ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించే పనిలో నిమగ్నమై ఉంది. ఇంజినీరింగ్ కోర్సులకు కనీస ఫీజును రూ.72 వేలు, గరిష్ట ఫీజును రూ.లక్షా 89 వేలుగా నిర్ణయించాలని కేంద్రం యోచిస్తోంది. ఇంజినీరింగ్ విద్యను అందిస్తున్న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఏఐసీటీఈకి ఉమ్మడి ఫీజు వసూలుపై వినతిపత్రాలు సమర్పించిన నేపథ్యంలో ఈ అంశాన్ని అధ్యయనం చేయాలని కేంద్రం కోరినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన ఫీజులతో కళాశాలలను నిర్వహించలేకపోతున్నామని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కళాశాలల్లో పని చేస్తున్న బోధనా సిబ్బందికి యూజీసీ సవరించిన వేతనాలను చెల్లిస్తున్నామని దీంతో నిర్వహణ భారంగా మారిందని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఉమ్మడి ఫీజు నిర్ణయానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. వారం రోజుల్లో తమ అభిప్రాయాలను వెల్లడించాలని కోరింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కనిష్ట ఫీజు రూ.35 వేలుగా ఉండగా, గరిష్ట ఫీజు రూ.లక్షా 34 వేలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం ఖరారు చేసిన ఈ ఫీజును వచ్చే విద్యా సంవత్సరం పెంచాల్సి ఉంది. ఎంసెట్, ఇంజనీరింగ్‌లో 10వేల ర్యాంకులోపు సాధిం చిన విద్యార్థులు ఇంజినీరింగ్‌కోర్సులో చేరితే ఆ కళాశాలలు నిర్ణయించిన మొత్తం ఫీజును అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఈ నిబంధన వర్తించదు.
పదివేలకు పైగా ర్యాంకులు సాధించిన విద్యా ర్థులు కళాశాలల్లో చేరితే ప్రభుత్వం బోధనా ఫీజు పథకం కింద రూ.35 వేలు చెల్లిస్తోంది. ఇంతకన్నా ఫీజు ఎక్కువుంటే విద్యార్థులు తమ సొంత జేబు నుంచి చెల్లించుకోవాలి. జాతీయ స్థాయిలో ఉమ్మడి ఫీజు విధానాన్ని అమల్లోకి తెస్తే ప్రభుత్వంపై మోయలేని భారం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తమ రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల ఫీజులను ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక నియంత్రణ కమిటీ ఖరారు చేస్తుందని ఈ కమిటీ సిఫారసుల ప్రకారం ఇంజినీరింగ్‌తో పాటు ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఈడీ వంటి వృత్తి విద్యా కోర్సుల ఫీజులను ఖరారు చేస్తున్నామని తెలం గాణ ఉన్నత విద్యా మండలి చెబుతోంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ రాసిన లేఖకు బదులి వ్వాలని నిర్ణయించింది. మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఆయా ప్రభుత్వాలు వెలుబుచ్చే అభిప్రాయం మేరకు ఉమ్మడి ఇంజినీరింగ్‌ఫీజు అంశాన్ని తేల్చే అవకాశం కనిపిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital