నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థిగా సూర్యపేట నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన పటేల్ రమేష్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ తనవంతు ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి మల్లు రవిలు సూర్యాపేటలోని ఆయన నివాసానికి చేరుకున్నారు.. అయితే అక్కడి కార్యకర్తలు వారిని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. రమేష్ రెడ్డి జోక్యంతో ఇంటిలోకి వెళ్లి ఆయనతో ఈ నేతలు చర్చలు ప్రారంభించారు.. ఇంట్లోనే చర్చలు జరుగుతున్న క్రమంలో బయట ఉన్న కార్యకర్తలు ఓపిక నశించి రమేష్ రెడ్డి ఇంటి కిటికీ అద్దాలు రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు.
ఈ పరిస్థితుల్లో నామినేషన్ ఉపసంహరించుకోవద్దని ఒకవేళ అదే జరిగితే సూర్యాపేటలో తిరిగే పరిస్థితి లేదని కార్యకర్తలు ఏకంగా రమేష్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.. కాగా , కాంగ్రెస్ నేతలు వచ్చిన సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి సతీమణి లావణ్య మీడియాతో మాట్లాడుతూ సర్వే నివేదికలన్నీ పటేల్ రమేష్ రెడ్డికి అనుకూలంగా ఉండగా దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమకు అన్యాయం జరగడానికి మొత్తం కారణం ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అని, రూ.30 కోట్లు తీసుకుని టికెట్ ఇప్పించారని ఆరోపించారు. నామినేషన్ ఉపసంహరణకు కొన్ని గంటలు సమయం మాత్రమే ఉండటంతో రమేష్ రెడ్డి తీసుకునే నిర్ణయంపై అయన అనుచరులు టెన్షన్ పడుతున్నారు..