డబుల్ ఇంజిన్ సర్కార్లు అంటూ గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ గుజరాత్ లో ఒరగబెట్టింది ఏమి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి మీడియా తో మాట్లాడారు. తెలంగాణలో ఉనికి కోసమే బీజేపీ పడరానిపాట్లు పడుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవాచేశారు. తెలంగాణ గురించి మాట్లాడే నైతికత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి లేదని తేల్చిచెప్పారు. అంతగా ప్రేమ ఉంటే ఇక్కడి అవసరాలకు అనుగుణంగా నిధులు తెచ్చి మాట్లాడితే విశ్వసనీయత పెరుగుతుందన్నారు. ఉద్యోగాల కల్పన పై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, ప్రధాని నరేంద్ర మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో 25 సంవత్సరాలుగా బీజేపీ ఎలుబడిలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అన్ని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. సరైన ప్రత్యామ్నాయం లేకనే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ లకు ప్రత్యామ్నాయం ఉన్న చోట కాంగ్రెస్, బీజేపీయేతరులే విజయం సాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అప్పులు తెచ్చి అదానీ, అంబానీ లకు పంచిపెడుతుంటే తెలంగాణలో ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి ఖర్చు పెడుతున్నామన్నారు.