హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విద్యార్థిని ప్రవల్లిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నాంపల్లి కోర్టులో నిందితుడ శివరాం రాథోడ్ లొంగిపోయాడు.. ఈ మేరకు అతడి తరుపన న్యాయవాదులు వేసిన సరెండర్ పిటిషన్ పిటిషన్‌కు నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది.
కాగా, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక ఈనెల 13న రాత్రి హైదరాబాద్‌లోని హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ప్రియుడు మోసం చేసిన కారణంగానే మర్రి ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడ్డట్టు నిర్థారించిన హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు ఆ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా వాసి శివరామ్ చేతిలో మోసపోయా నన్న విషయాన్ని ప్రవళిక తన సోదరుడు ప్రణయ్‌కి వాట్సాప్ సందేశాల ద్వారా తెలిపింది. ఈ మేరకు ప్రణయ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అలాగే ప్రవల్లిక ఆత్మహత్యకు కారణమైన శివరామ్ ను కఠినంగా శిక్షించాలని కెటిఆర్ ను ప్రవల్లిక కుటుంబీకులు అభ్యర్ధించారు..
మరోవైపు, శివరాం ఆచూకీ తెలపాలని అతడి కుటుంబ సభ్యులు తాజాగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. తమను పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల ప్రకారం.. శివరాం ఆచూకీ గురించి వివరాలు తెలపాలని పోలీసు స్టేషన్‌కు పిలిపించి మానసికంగా మనోవేదనకు గురిచేస్తున్నారని అతడి కుటుంబ సభ్యులు మానవ హక్కుల కమిషన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. శివరాం ఆచూకీ తెలపకపోతే ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించినట్టు తెలిపారు. శివరాం ఆచూకీ తెలుసుకోవాల్సిన పోలీసులు.. తమను ఇబ్బందులకు గురిచేసి ఎక్కడున్నాడని అడగడం దారుణమన్నారు. అతడి గురించి ఏ విషయం తెలిసినా పోలీసులు వెంటనే చెబుతామన్ని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులకు చిక్కడపల్లి పోలీసుల నుంచి ప్రాణభయం ఉందని, వారికి రక్షణ కల్పించాలని హెచ్‌ఆర్‌సీని శివరాం బంధువు సంతోష్ రాథోడ్ వేడుకున్నారు.