కెసిఆర్ పిటిషన్ ను విచారించిన త్రిసభ్య ధర్మాసనం
సుప్రీంకోర్టులో మాజీ సిఎం కు బిగ్ రిలీఫ్!
జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పై సుప్రీం కోర్టు అభ్యంతరం
విచారణ జరుగుతుండగా హద్దు దాటారు
ఆయనను మార్చాల్సిందేనంటూ ప్రభుత్వానికి ఆదేశం
ఆంధ్రప్రభ స్మార్ట్ – న్యూఢిల్లీ/ హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేసిన సీఐజే నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో రేవంత్ సర్కార్ నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా త్రిసభ్య ధర్మాసనం నేడు విచారించింది.
ఈ క్రమంలో కేసీఆర్ తరఫున ముకుల్ రోహత్గి, తెలంగాణ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా, కమిషన్ తరఫున గోపాల్‌శంకర్ నారాయణన్ తమ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్‌పై హోరాహోరీగా వాదనలు జరిగాయి.
అనంతరం సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ కమిషన్ చైర్మన్‌ను మార్చాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ తీరుపై సీజేఐ అభ్యంతరం వ్యక్తం చేశారు. జూన్ 11న విచారణ పూర్తి కాకముందే కమిషన్ చైర్మన్ తన అభిప్రాయం చెప్పేశారని సీఐజే వ్యాఖ్యానించారు. జడ్జి నిస్పక్షపాతంగా ఉండాలన్నారు. కమిషన్ చైర్మన్ ను మార్చే అవకాశం ఇస్తున్నామని ప్రభుత్వానికి తెలిపారు. కొత్త జడ్జి పేరును మధ్యాహ్నం చెబుతామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.