Friday, November 15, 2024

Supreme Court – ఇది మాదిగ‌ల విజ‌యం…. స్వాగతిస్తున్నాం – కెటిఆర్ ..

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – ఎస్సీ వర్గీకరణ కు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన నేడు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు చేసిన పోరాట విజయమిదన్నారు. మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ కు బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసిందని చెప్పారు. ఈ అంశంపై మిగతా రాజకీయ పార్టీలన్ని ఓట్ల రాజకీయం చేశాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఒకే పార్టీలో వర్గీకరణకు మద్దతుగా ఒక వర్గం…వ్యతిరేకంగా ఓ వర్గం వాదనలు వినిపిస్తూ ఎస్సీలను మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ మాత్రమే ఎస్సీ వర్గీకరణలో మిగతా పార్టీల మాదిరిగా ఒకే పార్టీలో మేము రెండు వాదనలు వినిపించలేదన్నారు. ఒక్క కేసీఆర్ మాత్రమే ఈ అంశాన్ని రాజకీయకోణంలో కాకుండా సామాజిక న్యాయ కోణంలో ఆలోచించారన్నారు. తెలంగాణ డిమాండ్ ఎంత న్యాయమైనదో…ఎస్సీ వర్గీకరణ కూడా అంతే న్యాయమైన డిమాండ్ అని కేసీఆర్ భావించారని చెప్పారు. అందుకే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసిన సంగతిని గుర్తు చేశారు.

- Advertisement -

స్వయంగా సీఎం హోదా లో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీకి ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ లేఖ ఇచ్చారన్నారు. ఎస్సీ వర్గీకరణ త‌న‌ బాధ్యత అని కూడా కేసీఆర్ చెప్పిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్రాలకే అధికారం ఇవ్వాలని కూడా కేసీఆర్ గతంలో కోరారన్నారు. ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసిందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement