సిరిసిల్ల, ఆగస్టు 18 (ప్రభన్యూస్) : పనిచేసే ప్రభుత్వానికి, పనికి వచ్చే ప్రభుత్వానికి మద్దతునివ్వండని, ఎవరో వచ్చి ఏదో నాలుగు మాటలు చెప్పగానే ఆగం కావద్దని రాష్ట్ర ఐటీ మున్సిపల్ పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ విగ్రహ ఆవిష్కరణను రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తో కలిసి జరిపారు. అనంతరం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల సందర్భంగా జరిగిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వమని, మీరు ఆశీర్వదిస్తేనే ఇక్కడ కూర్చున్నామని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా నాలుగు కోట్ల మంది కుటుంబానికి కేసీఆర్ కుటుంబ పెద్దగా అన్ని కులాలకు పెద్ద పీట వేస్తున్నాడని అన్నారు. పనిచేసే నాయకుడు కేసీఆర్ అని, పనిచేసే ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆశీర్వదించాలని కోరారు.
ముఖ్యమంత్రి ఏది అడిగితే అది ప్రజలకు ఇస్తున్నాడని పేర్కొన్నారు. టాటా బిర్లాల లాగా కులవృత్తులన్నీ బతకాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలన్నది ఆయన తపన అని అన్నాడు. శాశ్వతంగా నీటి సమస్య తీరుస్తున్నాడని, 365 రోజులు చెరువులు కుంటలు నిండుకుండలా ఉంటాయన్నారు. గోదావరి జలాలతో నీటి సమస్య తీర్చే బాధ్యత తమపై ఉందన్నారు. కొనరావుపేట మండలం మల్కాపేట రిజర్వాయర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే నెలలో ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు.