Saturday, November 23, 2024

పాలిటెక్నిక్‌ ఫెయిల్‌ అయిన వాళ్లకి మరో ఛాన్స్‌!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పాలిటెక్నిక్‌ ఫెయిల్‌ అయిన వారికి సాంకేతిక విద్యామండలి ప్రత్యేక అవకాశం కల్పించింది. 1990 నుంచి ఇప్పటి వరకు ఫెయిల్‌ అయిన వారికి ప్రత్యేక పరీక్షను నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. ఈ ఏడాది జూన్‌లో పరీక్షలు నిర్వహిస్తామని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి సి.శ్రీనాథ్‌ తెలిపారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ఈమేరకు విడుదల చేశారు. అయితే మూడేళ్ల వ్యవధి గల ఈ కోర్సును గరిష్టంగా ఆరేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సిలబస్‌ మారడంతో సప్లమెంటరీ పరీక్షలు రాసుకునే అవకాశం లేకుండా పోతుంది. అయితే కొన్ని సార్లు ప్రభుత్వం ప్రత్యేక అనుమతినిస్తుంది. ఇందులో భాగంగానే ఈ సారి 1990 నుంచి 2018 వరకు గట అభ్యర్థులఅఉ ఫెయిల్‌ అయిన సబ్జెక్టులకు పరీక్షలు రాసుకునేందుకు అవకాశం కల్పించారు.

వీరికి మూడు సబ్జెక్టుల నుంచి మినహాయింపునిచ్చారు. ఇలాంటి వారంతా తాజాగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 1990 నుంచి పాస్‌ కాలేకపోయిన వారి సంఖ్య వెయ్యికి పైగా ఉందని పేర్కొన్నారు. ఒక విద్యార్థి 12 సబ్జెక్టులు ఫెయిలైతే సంబంధిత అభ్యర్థి మూడు సబ్జెక్టుల నుంచి మినహాయింపు పొంది 9 సబ్జెక్టులకు పరీక్షలు రాసేందుకు వీలుంటుంది. ఇలా ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్‌ అయితే వాటి నుంచి మూడు సబ్జెక్టుల నుంచి మినహాయింపునిస్తారు. ఎవరైనా ఒకరు నాలుగు సబ్జెక్టులు ఫెయిలైన పక్షంలో మూడింటి నుంచి మినహాయింపు పొంది కేవలం ఒక సబ్జెక్టుకు మాత్రమే పరీక్ష రాసి పాస్‌ కావాల్సి ఉంటుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు రూ.3వేలు పరీక్ష ఫీజును ఏప్రిల్‌ 10 వరకు చెల్లించాలని తెలిపారు. రూ.400 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 14 వరకు, తాత్కాల్‌ స్కీం కింద పరీక్ష ఫీజుతో పాటు రూ.6వేలు అధనంగా కలిపి ఏప్రిల్‌ 15 వరకు చెల్లించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement