Monday, November 25, 2024

Super Exclusive …. ఎన్నికల వేళ వికృత ఆట‌.. అనైతిక పాట

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కండువాల జాతర… నైతికత పాతర… ప్రజాస్వామ్యం పూతరా… విన్యాసాలు చూడరా! …ఇదీ నేటి రాజకీయం తీరు. ఎన్నికల వేళ నేతల సర్కస్‌ మోళీలు చూసి జనస్వామ్యం బిత్తరపోతోంది… సమాజం నివ్వెరపోతోంది! పదవులే లక్ష్యం… పార్టీలు నిమిత్తమాత్రం… శ్రేణులంటే అలక్ష్యం! బలం చూపించు… బలగంతో బెదిరించు… సొమ్ము పంచు… వినకపోతే రంగు మార్చు… ఇది ఫైనల్‌! ప్రజాసేవ ముసుగులో రంగురంగుల కండువాల నీడలో నేతల విశృంఖల ఆట ఇది… అసంతృప్త నేతల పాట ఇది!

కుల, మత, వర్గ, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, స్వచ్ఛంద సంస్థలు, సంఘాల పేరుతో నేతలు ఎగబడి, తెగబడి, చివరకు తిరగబడి పదవుల కోసం కండువాలు కప్పుకునేందుకు బజారునపడుతూ చేస్తున్న విడ్డూర, వికృత, విపరీత చేష్టలను చూసి ప్రజాస్వామ్యవాదులు ఏవగించుకుంటున్నారు! ఏళ్ల తరబడి పార్టీ జెండాలు మోసి, భుజాలు కర్రులు కడుతున్నా వెనుదీయక నమ్మిన సిద్ధాంతాల కోసం సర్వస్వం ధారపోసిన కేడర్‌ను నట్టేట ముంచి వికటాట్టహాసం చేస్తున్న పాలిట్రిక్స్‌కు పోలింగ్‌లో బిక్కచచ్చి చూపుడువేలిపై పడుతున్న నల్లని సిరాకు సాక్ష్యమిది! వలస నేతలకు రెడ్‌కార్పెట్‌ స్వాగతాలు.. త్యాగాలు చేసిన, చేస్తున్న కేడర్‌కు సమాధి… వ్యక్తిగత స్వార్ధం… రాజకీయ పరమార్ధమే ప్రధానంగా నిర్లజ్జగా కండువాలు మారుస్తున్న వేగానికి ఊసరవెల్లులే నివ్వెరపోయి నిశ్చేష్టులవుతున్నాయి! ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటే అందులోకి సామ దాన బేధ దండోపాయాలతో జొరబడడం, అట్టహాసంగా… అదేదో వీరతాడు వేసుకున్నట్టు బిల్డప్‌లివ్వడం… కేడర్‌ను పట్టించుకోకపోవడం తీవ్రంగా హేళన చేయడమేనని ప్రజాస్వామ్యవాదులు వాపోతున్నారు.


ప్రతి ఎన్నికల్లోనూ చావో రేవో అన్నట్టుగా పోరాడుతున్న కేడర్‌ను కాదని, అసలు వారి అభిప్రాయాలతో పనేలేనట్టు వ్యవహరించడం, అప్పటివరకూ ప్రత్యర్ధిగా ఉండి తీవ్రంగా నష్టపరిచిన వారికే ఘనస్వాగతాలు పలకడం, అందలం ఎక్కించడం, మళ్లిd వారినే తమ నేతగా ప్రకటించి గెలిపించమనడం… అప్రజాస్వామిక, అనైతిక, అరాజకీయాలకు పరాకాష్టగా విశ్లేషిస్తున్నారు. ఇంకా ఇలానే పార్టీలు రాజకీయ అవసరాలు అంటూ వలస నేతలను ప్రోత్సహించడం చారిత్రాత్మక తప్పిదమే కాకుండా, సమాజానికి చక్కదిద్దుకోలేని కీడు చేసినట్టవుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

ఎన్ని అవసరాలు ఉన్నా, పార్టీ గెలుపే లక్ష్యంగా చెప్పుకుంటూ, అప్పటివరకూ తమనే తీవ్రంగా విమర్శించిన, ఆరోపణలతో చీల్చి చెండాడిన వారికే పార్టీ కండువాలు కప్పడం ఎంతవరకు సమంజసం, ఏవిధంగా సమర్ధనీయమని కేడర్‌ సూటిగా ప్రశ్నిస్తోంది. ఇటువంటి దివాళాకోరు రాజకీయవేత్తలకు చెక్‌పెట్టి రాజకీయ, ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టాల్సిన అవసరం నేడు తక్షణావశ్యమని సామాజికవేత్తలు, రాజకీయ పరిశీలకులు కోరుతున్నారు. రాజకీయ రణ క్షేత్రంలో వెన్నుపోట్లు పొడిచిన వారిని శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కరించడమే సరైన గుణపాఠంగా వారు పేర్కొంటున్నారు.
దశాబ్దాలుగా ఎవరితో కేడర్‌ పోరాడుతోందో వారికే పిలిచి పదవులు కట్టబెట్టడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్టగా కార్యకర్తలు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. ఓట్లు… సీట్లు… ఒక్కటే కాదని, కార్యకర్తల త్యాగాలు, వారి మనోభావాలకు కూడా విలువనిచ్చి గౌరవించినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని స్పష్టం చేస్తున్నారు. బేఖాతర్‌ చేస్తే నూతన నాయకత్వాలు సమాజం నుంచే ఉద్భవిస్తాయని, ఇప్పుడున్న అగ్రనేతలు అప్పుడు తలదించుకుని రాజకీయ యవనిక నుంచి తప్పుకోవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement