Friday, September 20, 2024

TG: సుంకిశాల ఘ‌ట‌న పాపం మీదే… కేటీఆర్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ హైదరాబాద్‌: సుంకిశాల ప్రాజెక్టుకు పునరుజ్జీవం తెచ్చిందే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని చెప్పారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. హైదరాబాద్‌ నీటి అవసరాల కోసం సుంకిశాల ప్రాజెక్టు మొదలుపెట్టారని, అయితే దానిని నల్లగొండ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీతో కలిసి ఇవాళ‌ కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ… నాగార్జునసాగర్‌లో డెడ్‌స్టోరేజీ ఉన్నా హైదరాబాద్‌కు నీటికష్టాలు రాకూడదనే ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సాగు, తాగునీటి కోసం సుంకిశాల ఉపయోగపడుతుందని చెప్పారు.

హైద‌రాబాద్ కు తాగునీటి కోసం..
కృష్ణానదికి నాలుగేండ్లు నీళ్లు రాకపోయినా ప్రాజెక్టుతో ఇబ్బందులు రావని స్పష్టం చేశారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలో నీటికోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, హైదరాబాద్‌లో నీటి కోసం ఇబ్బందులు పడే పరిస్థితి లేదని చెప్పారు. హైదరాబాద్‌కు 50 ఏండ్లు తాగునీటి అవసరాలకు సరిపడేలా తమ హయాంలో ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.

రెండున కూలితే.. వెంట‌నే ఎందుకు చెప్ప‌లేదు..
సుంకిశాల ఘటనను ప్రభుత్వం ఎందుకు తొక్కిపెట్టిందని ప్రశ్నించారు. ఆగస్టు 2న ఉదయం 6 గంటలకు ఘటన జరిగితే ప్రభుత్వానికి సమాచారం లేదా లేక విషయాన్ని కప్పిపెట్టారా అని ప్రశ్నించారు. ఒకవేళ తెలియకపోతే ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. త్వరత్వరగా పనులు చేయాలని హడావుడిగా గేట్లు పెట్టడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. ప్రభుత్వ నిర్వహణ లోపంతో గోడ కూలిందన్నారు. పనులు చేస్తున్న ఏజెన్సీని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. సుంకిశాల ఘటనపై న్యాయ విచారణ చేయాలన్నారు. సుంకిశాల గోడ కూలిన ఘ‌ట‌లో త‌మ ప్రభుత్వంపై రేవంత్ స‌ర్కార్ అసత్య ప్రచారం చేస్తున్నదని మందిప‌డ్డారు.

- Advertisement -

రేవంత్ దే బాధ్య‌త‌..
మున్సిపల్‌ శాఖను తనవద్దే పెట్టుకున్న సీఎం రేవంత్‌ ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. మేడిగడ్డలో ఏమైనా జరిగితే కేంద్రం స్పందిస్తుందని, ఇప్పుడు బీజేపీ ఏం చేబుతుందని కేటీఆర్‌ నిలదీశారు. మేడిగడ్డ ఘటనను ఎన్నికలున్నప్పటికీ తాము దాచిపెట్టలేదని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం సాగు, తాగునీటికి ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు కూడా వేగంగా చేశామన్నారు. సుంకిశాల ప్రమాదం కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు. పరిపాలన చేతగాక కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

పేర్లు మార్చ‌డ‌మే మీ ప్ర‌జా పాల‌న‌లో మార్పు ..
హైదరాబాద్‌లో శాంతి భద్రతలు సరిగ్గా లేవన్నారు. పేర్లు మార్చడమేనా మార్పు అంటే అని ఎద్దేవా చేశారు. వీళ్లకు సరుకు లేదు.. సబ్జెక్టు లేదని విమర్శించారు. బ్యారేజ్‌ గేట్లు ఎప్పుడు దించుతారో కూడా తెలియదని చెప్పారు. కాళేశ్వరం ఫెయిలైతే అన్ని రిజర్వాయర్లకు నీళ్లు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. నీళ్ల విషయంలో కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఆరోపణుల చేస్తున్నారన్నారు. రేవంత్‌ రెడ్డి చేతగాని తనంతోనే ఈ అంశాన్ని దాచిపెట్టారని ఆరోపించారు. మంచి అయితే వారి ఖాతాలో, చెడు అయితే తమ ఖాతాలో వేస్తున్నారని విమర్శించారు. సుంకిశాలను త్వరలో బీఆర్‌ఎస్‌ బృందం సందర్శిస్తుందని చెప్పారు. రిటైర్డ్‌ ఇంజినీర్లను కూడా తీసుకెళ్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement