Thursday, November 21, 2024

తెలంగాణ పీసీసీ మహిళా అధ్యక్షురాలిగా సునీతారావు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బాధ్యుల నియామకానికి ఎట్టకేలకు కాంగ్రెస్ హై కమాండ్ శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతారావు నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు నేరెళ్ల శారద రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగగా, ఇప్పుడా స్థానంలో సునీత బాధ్యతలు స్వీకరిస్తారు. హైకోర్టు న్యాయవాది అయిన సునీత.. ఎన్ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌లో పనిచేశారు. హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, పీసీసీలో వివిధ పదవుల్లో ఆమె పనిచేశారు.

కాగా, సునీత ఎంపికకు ముందు చాలా కసరత్తే జరిగింది. మొత్తం నలుగురు మహిళా నేతల వివరాలను తెప్పించుకున్న పార్టీ జాతీయ మహిళా అధ్యక్షురాలు సుస్మితా దేవ్.. వారిని ఫోన్ ద్వారా ఇంటర్వ్యూలు చేశారు. అనంతరం సునీతను ఎంపిక చేశారు. మహిళా సమస్యలపై ఆమెకు పూర్తి అవగాహన ఉండడం, భాషపై పట్టుతోపాటు పార్టీకి విధేయురాలిగా ఉండడంతో ఆమెను ఎంపిక చేశారు.

మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్‌గా ఎంపీ రేవంత్ రెడ్డిని ఎంపిక చేశారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, సీనియర్ల అసంతృప్తుల వల్లే పీసీసీ ప్రకటన ఆగిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement