Sunday, November 17, 2024

Sunday Effect – “నాగార్జున” లో జన”సాగరం”

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, నల్లగొండ : నాగార్జున సాగ‌ర్‌కు ఇన్‌ఫ్లో త‌గ్గింది. నిన్న 26 గేట్లు ఎత్త‌గా ఈ రోజు కేవ‌లం ఎనిమిది గేట్లు మాత్ర‌మే ఎత్తి 62,536 క్యూసెక్కుల నీరు మాత్ర‌మే విడిచిపెడుతున్నారు. నిన్న పూర్తిగా గేట్లు ఎత్తారు అని తెలుసుకుని ఆదివారం అధిక సంఖ్య‌లో ప‌ర్యాట‌కులు వ‌చ్చారు. అయితే.. ఎనిమిది గేట్లు మాత్ర‌మే ఎత్త‌డం వ‌ల్ల నిరాశ‌కు గుర‌య్యారు.

ఈ రోజు తెలంగాణ‌, ఆంధ్ర నుంచి అధిక సంఖ్య ప‌ర్యాట‌కులు చేరుకోవ‌డంతో సాగ‌ర్ ప‌రిస‌రాలు ర‌ద్దీగా మారాయి. ప‌ర్యాట‌కుల సంద‌డి..సాగర్ అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

సాగర్ రిజర్వాయర్ గేట్ల నుంచి వదులుతున్న కృష్ణమ్మ అందాలను చూస్తూ పర్యాటకులు పరవశిస్తున్నారు. ఒకవైపు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూనే మరోవైపు సాగర్ జలాశయం వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు.

ఎనిమిది గేట్లు ఎత్తివేత‌

- Advertisement -

శ్రీ‌శైలం నుంచి నాగార్జున సాగ‌ర్‌కి 1,02,746 క్యూసెక్కుల నీరు చేరుతుండ‌డంతో ఎనిమిది గేట్లను ఐదు అడుగుల‌ మేర ఎత్తి 62,536 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్నారు. నిన్న నాగార్జున సాగ‌ర్‌కి 3,59,779 క్యూసెక్కుల నీరు చేర‌గా, ఇక్క‌డ గేట్ల‌న్నీ ఎత్తి 3,12,756 క్యూసెక్కులు కింద‌కు విడిచిపెట్టిన సంగ‌తి విదిత‌మే.

ఈ రోజు కుడి కాలువ‌ ద్వారా 1058 క్యూసెక్కులు , ఎడమ కాలువ‌ ద్వారా 8367 క్యూసెక్కులు, పవర్ హౌస్ కి 28,785 క్యూసెక్కులు, ఏఎంఆర్పి ద్వారా 1800 క్యూసెక్కులు , ఎల్ఎల్సీ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు. ప్రాజెక్టులోకి 1,02,746 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా అంతే మొత్తంలో ప్రాజెక్టు నుండి నీటిని అధికారులు వదిలిపెడుతున్నారు. నిండుకుండ‌లా… నాగార్జునసాగర్ నిండుకుండ‌లా క‌నిపిస్తోంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 587.30 అడుగుల చేరుకుంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకు గాను 305.6 టీఎంసీలు ఉందని అధికారులు వెల్లడించారు.వ‌చ్చే వారం ఎలా ఉంటుందో? శ్రీ‌శైలం నుంచి నాగార్జున సాగ‌ర్‌కు ప్ర‌స్తుతం భారీగా వ‌ర‌ద రావ‌డంతో అన్ని గేట్లు ఎత్తారు. ఒక‌వేళ‌ ఇన్‌ఫ్లో త‌గ్గిపోతే ఎత్తిన గేట్ల సంఖ్య త‌గ్గించే అవ‌కాశం ఉంటుంది. ఇదే ఇన్‌ఫ్లో కొన‌సాగుతోంద‌న్న ప‌రిస్థితి లేదు. వచ్చేవారం ఎలా ఉంటుందో అని ఈ వారం అధిక సంఖ్య‌లో ప‌ర్యాట‌కులు సాగ‌ర్ సుంద‌ర దృశ్యాల‌ను తిల‌కించేందుకు వ‌స్తున్నారు.పోలీసుల ఆంక్ష‌లు…నాగార్జునసాగర్‌లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం కావడంతో సాగర్‌ అందాలను చూడటానికి పర్యాటకులు పోటెత్తారు. దీంతో ప్రధాన డ్యామ్‌, పవర్‌ హౌస్‌ పరిసరాల్లో వెళ్లకుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement