రైతు సురేందర్ రెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, రైతు కుటుంబనికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి డిమాండ్ చేశారు. రుణ మాఫీ కాలేదని ఆవేదన చెంది మేడ్చల్ జిల్లా వ్యవసాయ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న రైతు సురేందర్ రెడ్డి మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌లో మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
రుణమాఫీ కాలేదన్న కారనంతోనే..
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. రుణమాఫీ కాలేదన్న కారణంతో రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. పంట పండించే రైతన్న ప్రాణం కోల్పోయి గాంధీ హాస్పిటల్ మార్చురీలో ఉండటం మనస్సును కలిచివేసిందన్నారు. రైతన్నలారా.. రుణమాఫీ కాలేదనే కారణంతో దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. ధైర్యాన్ని కోల్పోకండి. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా నిచ్చారు. అలాగే మేనిఫెస్టోలో చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికి రుణమాఫీ చెయ్యాలన్నారు.