Saturday, November 23, 2024

TS | పెద్దపల్లి లోక్ సభ బరిలో ‘సుగుణ కుమారి’..

పెద్దపల్లి, (ప్రభన్యూస్‌): పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ చెల్లమెల్ల సుగుణ కుమారి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబును సుగుణ కుమారి గురువారం ప్రత్యక్షంగా కలవడంతోపాటు శుక్రవారం పెద్దపల్లి ఎంపీ టికెట్ కేటాయించాలని గాంధీభవన్ లో దరఖాస్తు చేసుకోవడం ఈ చర్చకు మరింత బలాన్ని చేకూర్చింది.

దళిత సంఘాల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న సుగుణ కుమారి కి సౌమ్యురాలు అని పార్లమెంట్ పరిధిలో మంచి పేరుంది. పెద్దపల్లి లోక్‌ సభ నియోజకవర్గ పరిధిలో సుగుణ కుమారికి ఉన్న పరిచయాలు కూడా కలిసి రానున్నాయి. ముఖ్యంగా మంత్రి శ్రీధర్‌ బాబు మద్దతు ఉండడంతో సుగుణ కుమారిని బరిలో దించితే పెద్దపల్లిలో కాంగ్రెస్‌ గెలుపు సులభమయ్యే అవకాశం ఉంటుందనే ప్రచారం మొదలైంది.

- Advertisement -

సుగుణ కుమారి మొదటిసారిగా 1999లో పెద్దపెల్లి ఎంపీగా గెలుపొందారు. రెండవసారి 2000 సంవత్సరంలో పార్లమెంటు సభ్యురాలుగా వెంకటస్వామి పై గెలుపొందారు. 2004 వరకు పార్లమెంట్ పరిధిలో సుగుణ కుమారి తనదైన ముద్ర వేసుకొని పనిచేశారు. గత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న సుగుణ కుమారి మరోసారి ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది.

పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబును కలిసి విన్నవించిన ఆమె ఆయన సూచన మేరకే శుక్రవారం కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిసింది. శ్రీధర్ బాబు పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉండటం, ఆయన మద్దతు సుగుణ కుమారికి ఉండటం వల్లే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సుగుణ కుమారి హస్తం గూటిలో చేరనున్నట్లు తెలిసింది.

ఇప్పటికే పెద్దపల్లి టికెట్ ను మాజీ ఎంపీ వివేక్ కుమారుడు గడ్డం వంశీ, మాజీ మంత్రి చంద్రశేఖర్, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, నిర్మాత ఆసంపల్లి శ్రీనివాస్, గోమాస శ్రీనివాస్, వూట్ల వరప్రసాద్, గజ్జల కాంతం, పేర్కాశాం, సందీప్ లు ఆశిస్తున్నారు. వీరితో పాటు మరికొంతమంది పెద్దపల్లి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా సుగుణ కుమారి దరఖాస్తు చేసుకోవడంతో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో హస్తం పార్టీ నుండి ఎవరు పోటీ చేస్తారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మంత్రి శ్రీధర్ బాబు మద్దతు ఎవరికి ఉంటే వారికి కాంగ్రెస్ టికెట్ దక్కనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement