Tuesday, November 26, 2024

డ్రోన్ల‌తో మందుల స‌ర‌ఫ‌రా సక్సెస్.. సెకెండ్ ఫేజ్ కి సిద్దం..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: రాష్ట్రంలోని మారు మూల ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా సకాలంలో పూర్తి స్థాయిలో ఔషధాలను సరఫరా చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధమవుతోంది. ఈ విషయమై ఉన్నతాధి కారులు త్వరలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించ నున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మొదటి దశ కింద ఇప్పటికే వికారాబాద్‌లో పైలట్‌ మోడ్‌లో డ్రోన్ల ద్వారా ఔషధాల పంపిణీ ప్రయోగం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు ముఖ్యంగా మారుమూల, ఏజెన్సీ ప్రాంతాలకు మెడిసిన్స్‌ను చేర్చడం ఇక సులువు కానుంది. విస్త్రృత ప్రాతిపదికన ఔషధాలను మోసు కెళ్లే డ్రోన్ల వినియోగం పెరగనుంది.

మారుమూల ఏజెన్సీ జిల్లాలైన ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఆదివాసీలు ఎక్కువగా నివసించే ములుగు, ఏటూరునాగారం ప్రాంతాలకు డోన్ల ద్వారా ఔషధాలను తరలించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రాధాన్యత ఇస్తోంది. కొండప్రాంతాలు, దట్టమైన అడవుల్లో ఉండే ఆదివాసీలు విష జ్వరాలు, డయేరియా బారిన పడుతున్నారు. అయితే వారున్న ప్రాంతాలకు వైద్య సిబ్బంది వెళ్లడం, వారికి ఔషధాలను అందుబాటులోకి తేవడం గగనమవు తోంది. ఫలితంగా ఏటా పెద్ద సంఖ్యలో ఆదివాసీ, గిరిజనులు విష జ్వరాలు, డయేరియాతో ప్రాణాలు కోల్పోతున్నారు.

హైదరాబాద్‌ నుంచి వికారాబాద్‌ ఏరియా ఆస్పత్రికి 53 కిలోమీటర్లను కేవలం 45 నిమిషాల్లోనే డ్రోన్లు చేరుకున్నాయి. ఏకంగా వ్యాక్సిన్‌ను కూడా విజయవంతంగా సరఫరా చేశాయి. మొదటి దశ విజయవంతం కావడంతో రెండో దశ మెడిసన్‌ ఫ్రం స్కై ప్రాజెక్టును లాంచ్‌ చేసేందుకు ఐటీ, వైద్య, ఆరోగ్యశాఖ సంయుక్తంగా ముందుకు కదులుతున్నాయి. మొదటి దశ డ్రోన్‌ మెడిసన్‌ను సెప్టెంబర్‌ 11న మంత్రి కేటీఆర్‌, కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి:

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement