కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, అప్పుడే మనం నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుతామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సినారే కళా మందిరంలో పోలీస్ నియామకాలకు సిద్ధమవుతున్న వారి కోసం సిరిసిల్ల పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమానికి హాజరై.. అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించి బంగారు భవిష్యత్‌గా మార్చుకోవాలని సూచించారు.
ఆరునెలలు పట్టుదలతో కూర్చొని ఏకాగ్రతతో, నిరాశ చెందకుండా చదవాలన్నారు. సోషల్ మీడియాను కొద్ది రోజులు పక్కన పెట్టి.. చదువుపై దృష్టి సారించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ అభ్యర్థులకు సైతం బైపాస్‌లోని అంబేద్కర్ భవనంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. అన్ని పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేలా బుక్స్ స్టడీ మెటీరియల్ అందజేస్తామని చెప్పారు. దూర, వ్యవ ప్రయాసాలకు లోనుకాకుండా.. శిక్షణ తరగతులకు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో లేని సౌకర్యాలు ఉచిత కోచింగ్ సెంటర్లలో కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కోచింగ్ సెంటర్లను ఎస్పీతోపాటు తాము సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని చెప్పారు. పుస్తకాలు నిజమైన దేవుళ్లనీ, మనం కోరుకున్న వరాలు ఇస్తాయని, అడుగడుగునా మనల్ని ఆశీర్వదిస్తాయని పేర్కొన్నారు.
చదువుంటే కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే.. ఆత్మ విశ్వాసం పెరుగుతుందన్నారు. తమను తాము పూర్తిగా నమ్మి.. పాత ఆలోచనలకు స్వస్తి చెప్పి.. కొత్త కోణంలో ఆలోచిస్తే విజయం తథ్యమన్నారు. ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో జిల్లాలోని 13 మండలాల్లోని నిరుద్యోగ యువతీ యువకుల కోసం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, 750 మంది ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. లెజెండ్ ఇన్‌స్టిట్యూట్ సౌజన్యంతో కేటీఆర్ క్లాసెస్ అనే యాప్‌ను సైతం రూపొందించినట్లు చెప్పారు. ఇందులో ఎస్‌ఐ, కానిస్టేబుల్, ఇతర ఉద్యోగాలకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల వారీగా 1800 వీడియోలు రూపొందించినట్లు వివరించారు. యాప్‌ను ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..