Friday, November 22, 2024

ఉప ఆలయాల పునరుద్ధరణ చేయాలి – నిధుల రాక పనుల్లో జాప్యం..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: కాకతీయ కళా వైభవానికి ప్రతీక అయిన రామప్ప దేవాలయం.. యునెస్కొ ప్రపంచ వారసత్వ సంపదగా తెెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు దక్కించుకున్న ఏకైక కట్టడంగా నిలిచింది. తెలంగాణ కళా కీర్తి ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించినా… అభివృద్ధిలో మాత్రం అంగుళం కూడా జరగటం లేదు. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు వచ్చి మూడు నెలలు దాటినా ఆలయ పునరుద్ధరణకు మాత్రం చర్యలు శూన్యం. పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న ఆలయ అభివృద్ధికి కేంద్రం నుంచి అధిక మొత్తంలో నిధులు విడుదల కావాల్సి ఉంది. యునెస్కో సూచించిన పనులకు వచ్చే ఏడాది డిసెంబర్‌తో గడువు ముగుస్తుండగా అభివృద్ధి పనులను మాత్రం ఇంకా మొదలు పెట్టకపోడం పట్ల స్థానికులు, పర్యాటకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా.. ఉపాలయాల పునర్నిర్మాణం, పునరుద్ధరణ, పరిసర ప్రాంతాల అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు తదితర పనులను 2022 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. యునెస్కో షరతుల్లో ప్రధానమైనది కామేశ్వర ఆలయ పునర్నిర్మాణం. ఉమ్మడి రాష్ట్రంలో 2009లోనే దీని పునరుద్ధరణ కోసం శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పూర్తిగా తొలగించారు. దాదాపు 12 ఏళ్లవుతున్నా పనుల ప్రారంభం కాలేదు. ఈ పనులను కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సి ఉండగా… ఇంకా టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టలేదు.

రామప్ప చుట్టూ పరిసరాల్లో 16 ఉపాలయాలున్నాయి. ఆలయ సమీపంలోని శివాలయం, గొల్లాల గుడిని పునరుద్ధరించాల్సి ఉంది. ఇటీవల రామప్ప సరస్సు కట్టపై ఉన్న శివాలయం, త్రికూటాలయాలనూ పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఆ పనులూ పట్టాలెక్కలేదు. పురాతన ఆలయాల పునర్నిర్మాణం, పునరుద్ధరణ పనులను నిపుణులు, స్తపతుల ఆధ్వర్యంలో చేపట్టాల్సి ఉండగా.. వారిని ఇంతవరకు గుర్తించలేదు.

రామప్ప ఆలయం కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉండటంతో ఆలయం చుట్టూ వంద మీటర్ల పరిధి వరకు కేంద్ర పురావస్తు శాఖే అభివృద్ధి పనులు చేయాలి. ఇన్నాళ్లుగా గుర్తింపుకు నోచుకోని రామప్ప ఆలయం, తాజాగా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు రావడంతో ఆలయ అభివృద్ధికి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ నుంచి భారీగా నిధులు మంజూరు కావాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర పురావస్తు శాఖ రూ.32 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనుల నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదించింది. వీటితో పాటు రూ.100 కోట్లతో ఆలయ పరిసర ప్రాంతాల్లో వివిధ ధీమ్‌ పార్కులు, రోడ్లు, రోప్‌వే, ఆధ్యాత్మిక కేంద్రాలు, అతిధి గృహాలు, పర్యాటకుల సౌకర్యాలకు చేయాల్సిన ఏర్పాట్ల కోసం ప్రతిపాదనలు ఉన్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement